ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేలకు పరాజయం

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ బీఆరెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ఎమ్మెల్యేలంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం చర్చనీయాంశమైంది

  • Publish Date - December 3, 2023 / 12:40 PM IST

ఆ నలుగురికి విరుద్ధంగా ప్రజాతీర్పు

విధాత : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ బీఆరెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ఎమ్మెల్యేలంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం చర్చనీయాంశమైంది. ఫామ్‌హౌజ్‌ కేసులోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట(ఎస్సీ) ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక(ఎస్టీ) ఎమ్మెల్యే రేగ కాంతారావు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు తమ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతుల్లో ఓడారు.


బీఆరెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ నేతలు తమను మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. సంబంధిత ఆడియో, వీడియో పుటేజీలను అప్పట్లో సీఎం కేసీఆర్‌ దేశంలోని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, నాన్‌ బీజేపీ రాజకీయ పక్ష నేతలకు పంపి దేశ రాజకీయాల్లో హల్‌చల్‌ చేసే ప్రయత్నం చేశారు. కోర్టుల్లో ఆ కేసులు నడుస్తుండగానే ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఆ నలుగురి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రావడం గమనార్హం.

రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బయ్యాని మనోహర్‌రెడ్డి చేతిలో, గువ్వల బాలరాజు కాంగ్రెస్‌ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో, రేగ కాంతారావు కాంగ్రెస్‌ ప్రత్యర్ధి పాయం వెంకటేశ్వర్లు చేతిలో, బీరం హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓటమి చెందారు.