– ఎర్ర శేఖర్, నాగం అందులో కాలుపెడుతున్నరు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఈ నావను ఎక్కేందుకు ఎర్ర శేఖర్, నాగం జనార్దన్ రెడ్డి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు తరలివచ్చిన జన సమూహాన్ని చూస్తుంటే జడ్చర్ల ఎమ్మెల్యేగా జనంపల్లి అనిరుధ్ రెడ్డి కచ్చితంగా 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ టికెట్ ఆశించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నాగంజనార్దన్ రెడ్డి మునిగిపోతున్న పడవలోకి, కాలిపోతున్న ఇంటిలోకి వెళ్తున్నట్టుగా ఉందని మల్లు రవి పేర్కొన్నారు. అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మీ ముందు కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నిలబడి మాట్లాడుతున్న అంటే, మీ అందరి ప్రేమ, అభిమానం అని అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యూఐ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.