విధాత, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రాజకీయ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దూకుడు పెంచారు. ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆరెస్ కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆరెస్ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా మెదక్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డిని బీఆరెస్ వైపు తిప్పుకునేందుకు ఆపార్టీ అధిష్టానం యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగంలోకి దిగారు.
బుధవారం రాత్రి మంత్రి…. ఇఫ్కా డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలసి శశిధర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే శశిధర్ రెడ్డి తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. చర్చల విషయాలు ఇంకా తెలియ రాలేదు. శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీఆర్ఎస్ లో చేరుతారా అనే విషయంపై స్పష్టత రాలేదు.