విధాత : గుర్తుల గుబులు గులాబీ పార్టీ బీఆరెస్‌ను వదలడం లేదు. కారును పోలిన గుర్తులు ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తూ తమ ఓట్లకు తద్వారా సీట్లకు గండి కొడుతుండటం బీఆరెస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భయపెడుతుంది. ఇప్పటికే కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రోడ్డు రోలర్, రోటీ మేకర్, ట్రక్, ఆటో రిక్షా, ఓడ వంటి కారును పోలిన గుర్తును రద్దు చేయాలంటూ బీఆరెస్ పదేపదే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తునే ఉంది. అయితే బీఆరెస్ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా స్పందించకపోవడంతో చేసేది లేక ఢీల్లి హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం హైకోర్టుల పిటిషన్ దాఖలు చేసిన బీఆరెస్ న్యాయవాది మోహిత్ అనూహ్యంగా విచారణ చేపట్టకముందుగానే తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
హైకోర్టుకు బదులుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇదే రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్ బీఆరెస్ పార్టీ నాయకత్వంలో నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు నకిరేకల్ సహా తదుపరి ఉప ఎన్నికల్లో, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లోనూ వేల సంఖ్యలో బీఆరెస్ అభ్యర్థులు ఓట్లు నష్టపోవడంతో కొన్ని చోట్ల ఏకంగా ఓటమి పాలుకావాల్సివచ్చింది. ఈ నేపధ్యంలో కారును పోలిన గుర్తుల రద్దుకు బీఆరెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.