KCR | పదిపన్నెండు సీట్లు ఇవ్వండి.. కాంగ్రెస్‌ మెడలు వంచుతా

చక్కగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు ఉడుముల్లా సొచ్చి ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు.

  • Publish Date - April 25, 2024 / 09:40 AM IST

ఇచ్చిన హామీలు అమలు చేయిస్తా
ఆకాశం, భూమి ఒకటి చేసినంత పోరాటం చేస్తా
చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి.. అవస్థలు తెచ్చారు
కరెంటివ్వడం చేతకాని దద్దమ్మలు
జైళ్లకు, తోకమట్టకు భయపడను
మిర్యాలగూడలో కేసీఆర్‌ నిప్పులు

మిర్యాలగూడ: చక్కగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు ఉడుముల్లా సొచ్చి ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బలం ఇస్తే.. అది తెలంగాణ ప్రజల బలం అవుతుందని, తెలంగాణ ప్రజల శక్తి అవుతుందని చెప్పారు. ప్రజల తరఫున కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలను బీఆరెస్‌ వంచి, వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తుందని తెలిపారు. మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి పార్లమెంట్‌ ఎన్నికల్లో కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణలో భూమి, ఆకాశం ఒకటి చేసినంత పోరాటం చేస్తానని చెప్పారు. తన బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నాగార్జున సాగర్‌ను కాంగ్రెస్‌ దద్దమ్మలు కేంద్రం చేతుల్లో పెట్టారని కేసీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారని చెప్పారు. తాను ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు.. కటుక బంద్‌ చేసినట్లే మాయమైందని అన్నారు. కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కేసీఆర్‌ తిట్టడం ఒక్కటే పని అని, తనను తిట్టి పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు.

జైళ్లకు, తోకమట్టకు భయపడుతానా?

తనను చర్లపల్లి జైల్లో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. జైళ్లకు.. తోకమట్టకు కేసీఆర్‌ భయపడుతడా? అట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ‘నిన్ను జైలులో వేస్తాం. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటం. నీ గుడ్లు పీకి గోలీలు ఆడుతం! ఇదా ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు హామీలకు పంగనామం పెట్టి.. ఈ రోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నరని విమర్శించారు. అంబేద్కర్‌ పుణ్యమాని తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెప్పారు. ఆయనను గౌరవించుకోవాలని 125 అడుగుల ఎత్తుతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అంబేద్కర్‌ జయంతి రోజున ఆ విగ్రహానికి ఒక్క మంత్రి కూడా దండ వేయలేదని ఆరోపించారు. ఇవాళ ప్రజలకు, కాంగ్రెస్‌కు పంచాయితీ పడ్డదని కేసీఆర్‌ చెప్పారు. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడే పంచాయితీ పెద్ద కావాలని, ఆ పెద్ద కేసీఆరేనా? అని ప్రశ్నించారు. మళ్లీ మన రాజ్యమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాక మనం అద్భుతంగా తీసుకుపోవాలని చెప్పారు.

నేను దిగిపోగానే అన్నీ బంద్‌

తన పాలనకాలంలో చేపట్టిన పనులను ఏకరువు పెట్టిన కేసీఆర్‌.. తాను దిగిపోగానే అన్నీ ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. నాలుగైదు నెలల కిందట ధీమాగా ఉన్న రైతు ఈ రోజు దిగాలుపడి చాలా బాధలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లపైనేనని చెప్పారు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటమన్నారు. ఇరిగేషన్‌ మంత్రి ఇక్కడే ఉన్నా.. దద్దమ్మల్లా నాగార్జునసాగర్‌ను కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారని ఆరోపించారు. 1956 నుంచి ఈ నాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే శత్రువన్నారు. ‘మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి.. అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు’ అని కేసీఆర్‌ విమర్శించారు.

Latest News