టార్గెట్ 60!

  • Publish Date - November 16, 2023 / 02:48 PM IST
  • మెజార్టీ మార్కు సాధనే లక్ష్యంగా బీఆరెస్‌, కాంగ్రెస్‌
  • గెలుపు కోసం.. సామ‌, దాన, భేద, దండోపాయాలు!
  • ఓటుకు 3 వేల పంప‌కానికీ సిద్ధ‌మైన‌ అధికార పార్టీ?
  • విప‌క్షాల చేతి ఖ‌ర్చుల‌కు చిల్ల‌ర రాకుండా క‌ట్ట‌డి!
  • అప్పులివ్వొద్ద‌ని ప‌లుచోట్ల ఫైనాన్స‌ర్ల‌కు బెదిరింపు
  • ప‌క్క పార్టీ బూత్‌ క‌మిటీల్లోకి సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు
  • కింది స్థాయి నేత‌ల‌కు ప్రచారాన్ని బ‌ట్టి ప్యాకేజీలు!
  • రాజకీయ పార్టీలకు అతీతంగా నగదు పందేరాలు!
  • ఇవే రాష్ట్ర చరిత్రలో అత్యంత ఖరీదైన ఎన్నికలు?

విధాత‌, హైద‌రాబాద్‌: హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పెట్టుకున్న అధికార బీఆరెస్‌, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని క‌ష్ట‌ప‌డుతున్న కాంగ్రెస్‌.. ఎంపిక చేసిన 60 స్థానాల‌ను టార్గెట్‌గా చేసుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఆయా నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్య‌ర్థులెవ‌రో తేలిపోయింది. దీంతో ఎన్నిక‌ల ప్ర‌చారంతో పాటు బ‌లాల స‌మీక‌ర‌ణ‌, ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం, అవ‌త‌లి పార్టీలోని అసంతృప్తులకు గాలం వేయ‌డం లాంటి కార్య‌క్ర‌మాల‌ను మ‌ల్టీ టాస్క్ పద్ధతిలో ఆయా పార్టీలు చేపట్టాయి. ఇందులో అధికార బీఆరెస్ ముందు వ‌రుస‌లో ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. రాజ‌కీయ పార్టీలు గెలుపు కోసం సామ‌, దాన, భేద, దండోపాయాలు ఉప‌యోగిస్తున్నార‌న్న‌ చ‌ర్చ జ‌రుగుతోంది.

బీఆరెస్ మాస్టర్ ప్లాన్‌

బీఆరెస్ నుంచి చాలా మంది కీల‌క‌ నేత‌లు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇదే తీరుగా బీజేపీ నుంచి బ‌డా నేత‌లే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగారు. క‌నుమ‌రుగవుతుంద‌నుకున్న కాంగ్రెస్ లేచి నిల‌బ‌డింది. బ‌ల‌ప‌డుతుంద‌నుకున్న బీజేపీ బ‌ల‌హీన ప‌డి నామ‌మాత్ర‌పు పార్టీగా మిలిగింది. ముక్కోణపు పోటీ ఉండాల్సిన స్థానంలో ద్విముఖ పోటీ నెల‌కొన్న‌ది. అయిన‌ప్ప‌టికీ ఒక 30 స్థానాల్లో ముక్కోణపు పోటీ ఉండే అవ‌కాశం ఉంది. స‌రిగ్గా ఇక్క‌డే బీఆరెస్ గెలుపు కోసం మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. శత్రువుకు శ‌త్రువు త‌న‌కు మిత్రుడ‌నే సామెత‌ను బీఆరెస్ అందిపుచ్చుకుంద‌ని, కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌డంతో పాటు సాధ్య‌మైనంత మేర‌కు ర‌హ‌స్య మిత్రుడిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో బీజేపీ ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ మేర‌కు బీజేపీ 111 స్థానాల్లో, మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

విచిత్రం ఏమిటంటే.. జనసేన పోటీచేసే స్థానాలు గెలుపుపై కనీస నమ్మకం లేనివి కావడం. మొత్తంగా

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో క్యాడ‌ర్ లేకున్నా బీజేపీ-జ‌న‌సేన కూట‌మి క‌లిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీకి అనేక నియోజ‌క వ‌ర్గాల్లో బూత్ క‌మిటీల‌లో కూర్చోవ‌డానికి ఏజెంట్లు కూడా లేని ప‌రిస్థితి ఉంద‌న్నచ‌ర్చ జ‌రుగుతోంది. దీనిని అవ‌కాశంగా తీసుకున్న అధికార బీఆరెస్ అనేక చోట్ల త‌న మ‌నుషుల‌నే గ్రామ స్థాయిలో బీజేపీ నేత‌ల వ‌ద్ద‌కు పంపించి, బూత్ క‌మిటీల‌లో నియామ‌కం అయ్యేలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అవ‌కాశంగా బీజేపీ కూడా బూత్ క‌మిటీల‌లో వారిని నియ‌మించుకుంటున్న‌ట్లు తెలిసింది. శేరిలింగంప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలోని ఒక బూత్‌లో బీఆరెస్ అభ్య‌ర్థి అరికెపూడి గాంధీ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన అనుచ‌రుడు త‌న భార్య‌ను బీజేపీ బూత్ క‌మిటీలో నియ‌మించేలా చేసుకున్నార‌ని, అత‌ను మాత్రం బీఆరెస్ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇదే ప‌రిస్థితి ఉంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్రత్యర్థులకు నిధులపై అడ్డుకట్ట!

ఎన్నికలన్నాక ఖర్చులు తడిసిమోపెడవుతాయి. అయితే.. కనీస ఖర్చులు కూడా పెట్టుకోలేని విధంగా ప్రత్యర్థి పార్టీలను అధికార బీఆరెస్ కట్టడి చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార బీఆరెస్ పార్టీ అభ్య‌ర్థులు వ‌రుస‌గా రెండు, మూడుసార్లు గెలిచి మ‌రోసారి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప‌నిలో ఉన్నార‌ని, న‌యానో, భయానో ఏమి చేసైనా స‌రే ఎలా ఒప్పించాలో వీరు తెలిసినవాళ్లని క‌రీంన‌గ‌ర్‌కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్య‌ర్థుల ఎంపిక చాలా ఆల‌స్యంగా జ‌రిగింద‌ని, ఈలోగా అధికార పార్టీ అభ్య‌ర్థులు రెండు ద‌ఫాలుగా ప్ర‌చారం చేయ‌డంతో పాటు అన్ని వ‌న‌రులు స‌మ‌కూర్చుకున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. మ‌రోవైపు అధికార పార్టీ విపక్ష పార్టీ అభ్య‌ర్థుల‌కు చేతి ఖర్చుల‌కు కూడా పైస‌లు అంద‌ని తీరుగా ఆర్థిక దిగ్బంధం చేసింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప‌లు జిల్లాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు అప్పుగా కూడా డ‌బ్బులు ఇవ్వ‌కూడ‌ద‌ని త‌మ ప‌రిధిలోని ఫైనాన్షియ‌ర్ల‌కు, గ్రామాల్లో కొద్దో గొప్పో వ‌డ్డీల‌కు ఇచ్చే మ‌ధ్య‌కారు రైతుల‌కు కూడా బెదిరింపులు వెళ్లాయ‌ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత చెప్పారు.


కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఒక నాయ‌కుడు మాట్లాడుతూ తనకు ఒక్క రూపాయి కూడా అప్పు పుట్ట‌నివ్వ‌డం లేదని, ఒక‌రిద్ద‌రు అప్పుగా ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, అయితే వాళ్లను అధికార పార్టీ అభ్యర్థి ఒకరు బెదిరించారని వాపోయాడు. మళ్లీ గెలిచేది తామేనని, తాము గెలిచిన తర్వాత నీ సంగతి చూస్తామని బెదిరించడంతో ఆయన డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేశాడని తెలిపారు. ఇటువంటి అనుభవాలు చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఉన్నాయని ఆయన చెప్పారు. విప‌క్ష‌నేత‌ల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు అప్పుకూడా దొర‌క‌కుండా ఫైనాన్షియ‌ర్ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన అధికార‌పార్టీ అభ్య‌ర్థులు, నాయ‌కులు.. నేరుగా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీకి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేశార‌న్న చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. తాము టార్గెట్ చేసిన 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌స‌ర‌మైతే పోలింగ్ తేదీ దగ్గర పడిన కొద్దీ ఓటుకు మూడు నుంచి ఐదు వేల వ‌ర‌కూ పంచేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అన్ని ఎన్నిక‌లు ఒక ఎత్తు.. ఇప్పుడు జ‌రుగ‌బోయే ఎన్నిక‌లు ఒక ఎత్తు అన్న‌ట్టు భ‌విష్య‌త్తులో చెప్పుకొనే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని పేర్కొంటున్నారు. అంత ఖ‌రీదైన ఎన్నిక‌లుగా ఇవి రికార్డు సృష్టించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

పలుకుబడి, పరపతిని బట్టి రేటు

ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు చోటా మోటా గల్లీ నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు తలకు ఇంత రేటుగా కొనుగోలు పర్వాన్నిరాజ‌కీయ‌పార్టీలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎదుటి పార్టీల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల పలుకుబడి, పరపతిని బట్టి రేట్లు ఫిక్స్ చేసి, కండువాలు కప్పుతున్నారని సమాచారం. ప్యాకేజీల పేరుతో సాగుతున్న కొనుగోలు దందా గ్రామాల్లో రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి మరింత ఊతమిస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ ముట్టిన చోటా మోటా నాయకులు జంప్‌ జిలానీలుగా మారిపోతున్నారు. ఏ రాజకీయ పార్టీ శిబిరంలో చూసినా, రచ్చబండల వద్ద ఏ నలుగురు కలిసినా ఫలాన నాయకునికి ఎంత ప్యాకేజీ అందిందన్న మాటే ప్రధానంగా వినిపిస్తున్నదని అంటున్నారు. లీడర్‌, కేడర్ ప్యాకేజీలతో లాభపడుతుంటే మరి మా సంగతేమిటంటూ ఓటర్లు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామపంచాయతీలలో వార్డు సభ్యులు స్థాయి నుంచి సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, జిల్లా స్థాయి నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ప్రధాన పార్టీలు ప్యాకేజీల వల విసురుతున్నాయి. అసంతృప్తి నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వలసలను అన్ని పార్టీలు కొనసాగిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకు ఉన్న నాయకులకు మేమున్నామంటూ బీఆరెస్‌, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు పరస్పరం పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తుండటంతో గ్రామాలు, పట్టణాల్లో క్షేత్ర స్థాయి రాజకీయాలన్ని డబ్బు పంపిణీ చుట్టే సాగుతున్నాయి.

యువజన, కుల సంఘాలకు సప‘రేటు’

యువజన సంఘాలకు, కుల సంఘాలకు ఇచ్చే ప్యాకేజీలు ప్రత్యేకంగా చెబుతున్నారు. సంఘాల వారిగా ప్రత్యేక ఇన్‌చార్జులను పెట్టుకుని, వారికి కావాల్సిన డబ్బులు, కానుకలు, విందులను అందిస్తూ ఖుషీ చేస్తున్నారని సమాచారం. సంఘాల సభ్యుల సంఖ్య మేరకు స్పెషల్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ వారి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్లు, టూర్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారని, టోర్నమెంట్ల నిర్వహణ కోసం నగదు ముట్టచెబుతున్నారని తెలుస్తున్నది. ఇందులో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ఉన్నదని అంటున్నారు.