KTR | బీజేపీ – కాంగ్రెస్‌లు కలిసి సింగరేణిని బొందపెడుతున్నాయి: కేటీఆర్

బొగ్గు బ్లాక్‌ల వేలం..ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు సింగరేంఇ సంస్థను బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు

  • Publish Date - June 20, 2024 / 05:51 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ విమర్శలు
బీఆరెస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష
16సీట్లు గెలిచిన టీడీపీ బలానికి విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది
బీఆరెస్‌కు ఆ శక్తినివ్వమన్న ప్రజలివ్వలేదని కీలక వ్యాఖ్యలు
సింగరేణిని కాపాడేది బీఆరెస్ ఒక్కటేనని పునరుద్ఘాటన

విధాత, హైదరాబాద్‌ : బొగ్గు బ్లాక్‌ల వేలం..ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు సింగరేంఇ సంస్థను బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెడితే ఆ క‌త్తికి కాంగ్రెస్ సాన‌బెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. బొగ్గుల బ్లాక్‌ల వేలం పాట‌ను కేంద్రం ఉప‌సంహ‌రించుకుని సింగరేణి పరిదిలోని బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సింగ‌రేణిని తొమ్మిదిన్న‌రేండ్లు కాపాడితే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో క‌లిసి బొంద పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

తెలంగాణ రాష్ట్రానికి బీఆరెస్‌ పార్టీ ఒక ర‌క్ష‌ణ క‌వ‌చమని,, శ్రీరామ‌ర‌క్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్ల‌లో ఒక్క‌సారి కాదు వేల సార్లు చెప్పారన్నారు. కేసీఆర్ 16 పార్ల‌మెంట్ సీట్లు ఇవ్వండి… కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంటామ‌ని చెబితే ప్రజలు అర్ధం చేసుకోలేదన్నారు. 16 ఎంపీల‌తో ఏం చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డితో స‌హా చాలా మంది విమర్శలు చేశారన్నారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉందని, టీడీపీ ప్రభావానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగిపోయిందన్నారు. కానీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయని, వారికి 16 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ఇవాళ హైద‌రాబాద్‌లో బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్న‌ట్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించార‌ని కేటీఆర్ విమర్శించారు.

బొగ్గు గ‌నుల‌ను వేలం వేయొద్ద‌ని 2021, డిసెంబ‌ర్ 8న కేంద్రానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సింగ‌రేణికి బొగ్గు గ‌నుల‌ను అప్ప‌గించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్ర‌స్తుతం సింగ‌రేణిలో 51 శాత రాష్ట్రం వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉందని, కాబ‌ట్టి సింగ‌రేణికే బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేసీఆర్ అడిగారని, నాటి పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కూడా నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిసెంబ‌ర్ 11, 2021.. ప్ర‌ధానికి లేఖ రాశారని, ఇవాళ బొగ్గు గ‌నుల వేలంలో పాల్గొంటామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క చేత చెప్పించార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

కేంద్రం ప్రైవేటీకరణ విధానాలతోనే ముప్పు

మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ‌ ద్వారా ఏ టెండ‌ర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గ‌నుల‌ను నైవేల్లి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్ప‌గించారని కేటీఆర్ వివరించారు. గుజ‌రాత్‌లో గుజ‌రాత్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, గుజ‌రాత్ ఇండ‌స్ట్రీ ప‌వ‌ర్ లిమిటెడ్‌కు 2015లో నాలుగు బొగ్గు గ‌నులు అప్ప‌జెప్పారని, ఒక వైపు ఒడిశాలో రెండు, గుజ‌రాత్‌లో రెండింటికి ఐదు బొగ్గు గ‌నులు అప్ప‌జెప్పారని తెలిపారు. త‌మిళ‌నాడులోనూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌కు బొగ్గు గ‌నులు వేలం లేకుండా ఇచ్చారని, అదానీకి బైల‌దిల్లా గ‌ని కేటాయించ‌డం వ‌ల్ల విశాఖ ఉక్కు న‌ష్టాల్లోకి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో పోయింది ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు అప్ప‌గిస్తున్నామ‌ని కొంద‌రు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారని, సింగ‌రేణి విష‌యంలో కూడా ఇదే వైఖ‌రి అవ‌లంభిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించ‌కుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న‌ కుట్రను గతంలో వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు వ్యతిరేకించడం లేదని కేటీఆర్ నిలదీశారు. డిప్యూటీ సీఎం స్వయంగా వేలం పాట‌లో పొల్గొంటామ‌ని చెబుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ రావాలేగాని మన కేంద్రమంత్రి ఉన్నది అమ్మే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. లోక్ సభలో బీఆరెస్‌ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారు. బీజేపీ కి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే…వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని ప్రశ్నించారు.

సింగ‌రేణిని కాపాడే శక్తి బీఆరెస్ మాత్రమే

తొమ్మిదన్నరేండ్లుగా కేంద్రం మా మెడపై కత్తి పెట్టినా బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణిని కాపాడుకున్నామని, ఎప్పటికైనా సింగరేణిని కాపాడేది బీఆరెస్ మాత్రమేని కేటిఆర్ స్పష్టం చేశారు. సింగ‌రేణి లాభ‌ప‌డితే మ‌న రాష్ట్రానికి, కార్మికులు లాభం జరుగుతుందన్నారు. సింగ‌రేణి కార్మికులు జంగ్ సైర‌న్ ఊదితే ద‌క్షిణ భార‌త‌దేశం అంధ‌కారంలోకి వెళ్లిన‌ ప‌రిస్థితి ఉంటుందన్నారు. మ‌న గ‌నుల్లో మ‌నం బొగ్గు త‌వ్వుకోకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గమని, సింగ‌రేణి కార్మికులు అన్నీ అర్థం చేసుకోని, సింగ‌రేణి బొగ్గు బ్లాకుల‌ను కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డాన్ని ప్రశ్నించాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఖ‌తం చేసిన‌ట్టే సింగ‌రేణిని ఖ‌తం చేస్తారని, అందుకు కేంద్ర-రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ నిర్ణయానికి సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు వంత పాడుతున్నారని, రేపటి వేలంలో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొనబోతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

వేలం పాటలో పాల్గొనటమంటేనే దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిని అంగీకరిస్తున్నట్లేనన్నారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని నిలదీశారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు. మళ్లీ మా ప్రభుత్వం వస్తది. అప్పుడు ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటామన్నారు. వేలంలో పాల్గొనబోయే ప్రైవేట్ కంపెనీలకు మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఇకనైనా బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఇక్కడున్న ఎంపీలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి ప్రయోజనాలు పట్టనట్లుగా కాంగ్రెస్, బీజేపీ లు వ్యవహరిస్తున్నాయన్నారు. సింగరేణిని ఖతం చేసే కుట్రను బీఆరెస్‌ అడ్డుకుంటుందన్నారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణనను కూడా రెండు, మూడో రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

Latest News