Site icon vidhaatha

KTR | నా వ్యాఖ్యలతో మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నా : కేటీఆర్‌ ట్వీట్‌

KTR : రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (BRS working president) కేటీఆర్‌ (KTR) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఎక్స్‌ (X) వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలతో సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమవేశంలో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘నిన్న జరిగిన పార్టీ సమావేశంలోనే యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. నేను విచారం వ్యక్తం చేస్తున్నా. అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ నాకు లేదు’ అని తన పోస్టు ద్వారా వెల్లడించారు.

కాగా కేటీఆర్ బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాట్లాడారు. బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బ్రేక్‌డ్యాన్స్‌లు కూడా వేసుకోండి అన్నారు. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడటంతో వివాదం రాజుకుంది. రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు.

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. అంతేకాదు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Exit mobile version