రెండు ట్రావెల్స్ బస్సుల బోల్తా.. ముగ్గురు మృతి

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

  • Publish Date - May 23, 2024 / 12:30 PM IST

విధాత : తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బొల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది.

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబుబా ఘాట్ వద్ద ప్రమాదంలో 25మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హనా(28) మృతి చెందింది. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురిని కాళ్లు, చేతులు విరిగాయి. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో బాధిత ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోడుమూరు బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా అతివేగంతో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8) మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు కాగా వారందరిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Latest News