తుగ్లక్ సీఎం లక్షల కోట్లు దోచుకున్నాడు: కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

  • Publish Date - November 16, 2023 / 01:44 PM IST

– లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు

– కాళేశ్వరంలో 70 వేల కోట్లు..

– మిషన్ భగీరథలో 40 కోట్లు స్కాం

– తెలంగాణకు 6 లక్షల కోట్ల అప్పు

– సెంట్రల్ లైటింగ్ ను అభివృద్ధి అంటున్న బాల్క

– చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగించాడని, స్కాంలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని కాదని, కిందికి తీసుకెళ్లి కాళేశ్వరం నిర్మించి కమీషన్ రూపంలో లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, ప్రాణహిత-చేవెళ్ల గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రీ డిజైన్ పేరుతో మేడిగడ్డకు తరలించి, కాళేశ్వరం నిర్మించి 70 వేల కోట్లు కమీషన్ తీసుకున్నారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 40 వేల కోట్ల కుంభకోణం చేశారని, ప్రతి ఇంటికి మాత్రం స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేకపోయారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం స్కాముల్లో ఆరితేరారని.. కవిత లిక్కర్స్ స్కాంలో 100 కోట్లు గడించారని ఆరోపించారు.

బాల్క ఆరోపణలు నిరాధారం

చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ తనపై నిరాధారమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లిందని వివేక్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని పేర్కొనడం సెంట్రల్ లైటింగ్ వేస్తే అభివృద్ధి అవుతుండా అని ప్రశ్నించారు. కాక వెంకటస్వామి హయాంలో సింగరేణిని ఎంతో కాపాడారని, బీఐఎఫ్ఆర్ లోకి వెళ్లిన సింగరేణి సంస్థను దాని నుండి బయట పడేశారని పేర్కొన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేయించామని పేర్కొన్నారు. చెన్నూరు నియోజవర్గంలో విశాఖ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశామని, స్కూళ్లకు ఫర్నీచర్, బోర్వెల్స్ వేయించామని అన్నారు అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో 30 వేల మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన పడిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయని, కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే పగుళ్లు తేలుతున్నదని, దానిమూలంగా మంచిర్యాల జిల్లా ముంపునకు గురవుతుందని ఆరోపించారు.