– రేపు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మాజీ మంత్రి బోడ జనార్దన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి పంపారు. రేపు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకొనున్నారు . మంచిర్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సోమవారం బోడ జనార్దన్ విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసినా అధిష్టానం పట్టించుకోలేదన్నారు. కార్పొరేట్ వ్యాపారం చేసి డబ్బు సంచులతో వచ్చిన వివేక్ కు టికెట్ కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు.
ప్రజా సర్వేలో తమకే టికెట్ ఇస్తానని పేర్కొని, తీరా బీజేపీ నుండి వచ్చిన వివేక్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వరాదని ఉన్నప్పటికీ, గడ్డం వివేక్ కు, వినోద్ కు టికెట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. చెన్నూరు ప్రజలు అన్న వినోద్ ను ఓడిస్తే, చెన్నూరు వదిలి బెల్లంపల్లి వెళ్లారని.. ఈ ఎన్నికల్లో వివేక్ ని ఓడిస్తే మళ్లీ ఎక్కడికి వెళ్తారని ఎద్దేవా చేశారు. కనీసం ఆ నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్లకు టిక్కెట్ ఇవ్వడం సీట్లు అమ్ముకోవడమే అవుతుందని ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి 15 సీట్లు కేటాయిస్తే, అందులో మాదిగ సామాజిక వర్గానికి 8, మాల సామాజిక వర్గానికి 7 కేటాయించారన్నారు. అందులో వెంకటస్వామి కుటుంబానికి మూడు సీట్లు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గం అంటే కాక కుటుంబమే అన్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకోవడం సమంజసం కాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకుంటే, అందులో ఎవరికీ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వివేక్ కు టికెట్ కేటాయించడం సరికాదన్నారు. చెన్నూరులో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోలు చేస్తున్నారని, వారు డబ్బుకు అమ్ముడుపోరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వివేక్ ను ఓడిస్తారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తే, ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
తనలాగే చాలామంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన ఆహ్వానం మేరకే రేపు మందమర్రిలో జరగబోయే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.