62 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్‌లు

సీఎం కేసీఆర్ తాను ఆగస్టు 21న ముందుగా ప్రకటించిన 114మంది అభ్యర్థులకుగాను ఆదివారం తొలి దఫాగా 62 మందికి మాత్రమే బీ ఫామ్‌లు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది

  •  మూడ్రోజుల్లో మిగతావారికి అంద‌జేత‌
  • అయినా టికెట్ పొందిన‌ అభ్యర్థుల్లో గుబులు
  • 3 లేదా 4 స్థానాల్లో అభ్యర్థుల మార్పు?
  • సంగ‌రెడ్డి టికెట్ మామిళ్ల రాజేంద‌ర్‌కు?

విధాత : బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ తాను ఆగస్టు 21న ముందుగా ప్రకటించిన 114మంది అభ్యర్థులకుగాను ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తొలి దఫాగా 51మందికి తెలంగాణ భవన్ లో.. తదుపరి 11 మందికి తన నివాసంలో బీ ఫామ్‌లు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. మల్కాజిగిరితో పాటు నర్సాపూర్‌, నాంపల్లి,గోషామహల్ అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉంది. అయితే కేసీఆర్ స్వయంగా ప్రకటించిన మిగతా 114 అభ్యర్థులలో కేవలం 62మందికే బీ ఫామ్‌లు ఇవ్వడంతో మిగతా అభ్యర్థులలో గుబులు మొదలైంది. తమలో ఎవరి టికెట్ కోత పెడుతారోనన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అయితే కేసీఆర్ కోణంలో ఆలోచిస్తే ఆయన లక్కీ నెంబర్ 6ను అనుసరించి 15వ తేదీతో పాటు 51మంది అభ్యర్థులకు ఒక విడతలో బీ ఫామ్‌లు ఇచ్చారని, సాయంత్రం విడిగా కొంతమందికి ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రకటించిన అభ్యర్థుల్లో పలువురి టికెట్లకు కోత పడవచ్చన్న ప్ర‌చారం సాగుతున్న‌ది. పటాన్ చెరు, అలంపూర్‌, అంబర్ పేట, సంగారెడ్డి, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు ఉండవచ్చన్న గుసగుసలు వినబడుతున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా చూశాక పలు నియోజకవర్గాల్లో కూడా బీఆరెస్ అభ్యర్థుల మార్పుకు అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్ మాత్రం రానున్న మూడు రోజుల్లో మిగిలిన అందరికీ బీ ఫామ్‌లు ఇస్తామని చెప్పినా అవి చేతికొచ్చేదాకా గుబులేనంటూ అభ్యర్థుల్లో అంతర్మథనం నెలకొంది. ముదిరాజ్‌లకు పార్టీ టికెట్లు ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌కు సంగారెడ్డికి కేటాయించే విషయమై ఆలోచన సాగుతుందంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానంలో మామిళ్లకు టికెట్ ఇచ్చేందుకే తొలి దఫా బీ ఫారాల పంపిణీలో చింతకు బీ ఫారమ్ దక్కలేదన్న ప్రచారం మొదలైంది. పటాన్‌చెరు టికెట్‌పైన కూడా ఇదే రకమైన ప్రచారం వినిపిస్తున్నది. కాగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాతృ వియోగ కర్మల నేపధ్యంలో అందుబాటులో లేని కారణంగా ఆయన బీ ఫామ్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి బీఫామ్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీసుకున్నారు. గజ్వేల్ బీ ఫామ్ తదుపరి దఫాకు పెండింగ్‌లో ఉంది. బీ ఫామ్‌లు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులలో పలువురు మంత్రులు కూడా ఉండటం విశేషం.

అభ్యర్థులకు జాగ్రత్తలు చెప్పిన కేసీఆర్‌

బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ హెచ్చ‌రించారు. ఓ ఐదు నిమిషాల పాటు క్లాస్ పీకారు. ప్ర‌తి అభ్య‌ర్థి నోరు అదుపులో పెట్టుకోవాల‌ని, సంస్కారంతో మాట్లాడాల‌ని, కోపానికి దూరంగా ఉండాల‌ని అభ్య‌ర్థుల‌కు సూచించారు. ఫ‌అభ్య‌ర్థులకు సంస్కారం ఉండాలి. ప్ర‌జ‌ల‌కు దండం పెట్టి ఓటు కావాల‌ని అడుగుతాం. రాజ‌కీయాలు అన్న‌త‌ర్వాత మంచి, చెడు ఉంటాయి. అల‌క‌లు ఉంటాయి. అంద‌రి కంటే ఎక్కువ‌గా అబ్య‌ర్థులు ప్ర‌జ‌ల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్య‌క‌ర్త‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాలి. ఇది త‌ప్ప‌క పాటించాలి. గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రికి చెప్పాను. వ్య‌క్తిత్వం మార్చుకోవాల‌ని చెప్పాను. మాట్లాడ‌లేదు. ఒక‌రు ఓడిపోయారు. జూప‌ల్లి కృష్ణారావు ఒకాయ‌న ఉండే.. మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న అహంకారంతో ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌లేదు. ఓడిపోయారు. అలా ఉంట‌ది. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయ‌కుడికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాలి. నాయ‌కుల‌ చిలిపి ప‌నులు, చిల్ల‌ర ప‌నుల వ‌ల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కార‌వంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాలి.

ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌తంగా మ‌న‌వి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘ‌ట్టం. మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలి. కార్య‌క‌ర్త‌ల‌కు మ‌న‌ల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు. మీ అంద‌రికీ చాలా సంద‌ర్భాల్లో, చాలా స‌మావేశాల్లో పదే ప‌దే ఒక మాట చెప్పాను. మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు వ‌స్తాయి, విజ‌యం సాధిస్తార‌ని ఆత్మ‌విశ్వాసం ప్ర‌క‌టించాను. మీ అంద‌రికీ అవ‌కాశం రావ‌డం సంతోషంగా ఉంది. ఎవ‌రికైతే అవ‌కాశం రాలేదో.. వారు తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వ‌డ‌మే ఫైన‌ల్ కాలేదు. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పాం. మార్చుకున్న చోట విచిత్ర‌మైన సంద‌ర్భాలు ఉన్నాయి. వేముల‌వాడ‌లో మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి కాబ‌ట్టే అక్క‌డ అభ్య‌ర్థిని మార్చుకోవాల్సి వ‌చ్చింది అని కేసీఆర్ తెలిపారు.

బీ ఫారాల విష‌యంలో అభ్యర్థులకు పలు హెచ్చరికలు, సూచనలు చేసిన కేసీఆర్‌.. బీఫామ్‌లను జాగ్రత్తగా నింపాలని, ఆగమాగం కావద్దని, తప్పులు లేకుండా చూసుకోవాలని, ఏదైనా పొరపాటు జరిగితే అది పనికిరానందునా ఒక్కోక్కరి రెండు సెట్ల బీ ఫారాలు ఇస్తున్నానన్నారు. నామినేషన్లకు చివరి రోజు వరకు సమయం ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్‌లలో తప్పులు దొర్లి లీగల్‌గా ఇబ్బందులు పడ్డారని, అలాంటివి పునరావృతతం కాకుండా చూసుకోవాలన్నారు.ఎన్నికలలో వచ్చే కొత్త నిబంధనలకు అనుగుణంగా బీ ఫామ్‌లు, అఫిడవిట్‌లు భర్తీ చేయాలని, సందేహాల నివృత్తి కోసం పార్టీ లాయర్ సోమ భరత్ అందుబాటులో ఉంటారన్నారు.

బీఫామ్ లు తీసుకున్న బీఆరెస్ అభ్యర్థులు

1) కోనేరు కోనప్ప

2) దుర్గం చిన్నయ్య

3) ఎన్‌. దివాకర్ రావు

4) కోవా లక్ష్మి

5) భూక్యా జాన్నన్ నాయక్‌

6)జోగు రామన్న

7) అనిల్ జాదవ్‌

8) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి

9) విఠల్ రెడ్డి

10) కె.చంద్రశేఖర్ రావు

11) షకీల్‌

12) హనుమంత్ షిండే

13) పోచారం శ్రీనివాస్‌రెడ్డి

14) జె.సురేందర్‌

15) బి.గణేష్‌గుప్తా

16) బాజిరెడ్డి గోవర్ధన్‌

17) వి.ప్రశాంత్‌రెడ్డి

18) పట్నం నరేందర్ రెడ్డి

19) ఎస్‌. రాజేందర్‌రెడ్డి

20)డాక్టర్ సి.లక్ష్మారెడ్డి

21) ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి

22) వి. శ్రీనివాస్‌గౌడ్‌

23) సీహెచ్‌. రాంమోహన్‌రెడ్డి

24) ఎస్‌. నిరంజన్‌రెడ్డి

25) బి.కృష్ణమోహన్‌రెడ్డి

26) మర్రి జనార్ధన్‌రెడ్డి

27)గువ్వల బాలరాజు

28) జైపాల్ యాదవ్‌

29) అంజయ్య యాదవ్‌

30) బి.హర్షవర్ధన్‌రెడ్డి

31) పద్మా దేవేందర్‌రెడ్డి

32) ఎం.భూపాల్‌రెడ్డి

33) చంటి క్రాంతి కిరణ్‌

34) జి.మహిపాల్ రెడ్డి

35) కె. ప్రభాకర్‌రెడ్డి

36) రేగా కాంతారావు

37) హరిప్రియానాయక్‌

38) పువ్వాడ అజయ్‌కుమార్‌

39) కె. ఉపేందర్ రెడ్డి

40) ఎల్‌. కమల్‌రాజ్‌

41) బాణోతు మదన్‌లాల్‌

42) వనమా వెంకటేశ్వర్‌రావు

43) ఎస్‌. వెంకటవీరయ్

44) మెచ్చా నాగేశ్వర్‌రావు

45) తెల్లం వెంకటరావు

46) పైళ్ల శేఖర్‌రెడ్డి

47) కే.టి.రామారావు

48)పల్లా రాజేశ్వర్‌రరెడ్డి

49) టి.హరీశ్‌రావు

50) ఎ. జీవన్‌రెడ్డి

51) బాల్క సుమన్‌