విధాత: పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ అభివృద్ధి పరంపర ఇట్లాగే కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 50 ఏండ్లు మనల్ని రాచిరంపాన పెట్టిందెవరో.. మనం తిరుగుబాటు చేసిన్నాడు మన తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందెవరో ఒక్కసారి ఆలోచన చెయ్యాలని కోరారు. మళ్లీ కాంగ్రెసోళ్ల చేతుల్లో పడితే.. కరెంట్ బాధలతో పరిశ్రమలన్నీ బంద్ అయితయని హెచ్చరించారు. ప్రజలందరూ ఆలోచించి బీఆరెస్‌కు అండదండగా ఉండాలని మనవి చేశారు. ఈ ఎన్నికల్లో ఆపదమొక్కులు మొక్కుతూ, ఇష్టారీతిన మాట్లాడేవాళ్లు వస్తారని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆనాడు కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని విమర్శించారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టులు కట్టుకొని సాగునీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు.
ఉద్యమం ప్రారంభించిన నాడు అవమానించారు
ఇరవై ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిననాడు అందరూ నవ్వులాటగా తీసుకున్నారని, తన మీద ఎన్నోరకాల నిందలు వేసి, అవమానాలు చేసి, ఎన్నిరకాల అవహేళనలు చేసిండ్రో మీకందరికీ తెలుసని అన్నారు. ఆనాడు కరెంటు లేదు.. మంచినీళ్లు లేవు.. సాగునీళ్లు లేవు.. పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు ప్రజల వలసలు పోయే హృదయవిదారకమైన దృశ్యాలుండేవని గుర్తు చేశారు. నాడు భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే తాను దుఃఖపడి, ఆనాటి ముఖ్యమంత్రిని జోలెపట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా సహాయం చెయ్యలేదని చెప్పారు. దుర్మార్గమైన పరిపాలనలో తెలంగాణ ప్రజలు రెండవ తరగతి స్థాయి ప్రజలుగా చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ, అవమానాలకు గురయ్యారని అన్నారు.
నేడు తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. మిషన్ భగీరథను విజయవంతం చేసుకుని తాగునీటిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. కుల,మతాలు లేకుండా తెలంగాణ బిడ్డలందరూ మనవాళ్లేనని పేదలందరినీ ఆదుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు. దాదాపు 40, 50 లక్షల విలువు ఉండే ప్లాట్లను ఒక్క రూపాయి కూడా లేకుండా పేదలకు 26 వేల ఇండ్లను ఉచితంగా ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని చెప్పారు. హైదరాబాద్ లోని పేదలకు మరో లక్ష ఇండ్లను కట్టిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మేడ్చల్ జిల్లా నియోజకవర్గాలు.. మినీ ఇండియాలు
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేశామని, కొత్త కలెక్టరేట్ ను కూడా ప్రారంభించానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే మేడ్చల్ జిల్లా ఏర్పడేదే కాదని అన్నారు. మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో చైతన్యవంతులని ప్రశంసించారు. మేడ్చల్, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారత దేశాలని, మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలూ ఇక్కడికి వస్తుంటారని, వివిధరకాల పనుల కోసం పేదలు ఇక్కడికి వస్తుంటారని సీఎం చెప్పారు. మేడ్చల్ జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి రాబోయే రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అయిన చామకూర మల్లారెడ్డి కి ఘన విజయం చేకూర్చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.