కాంగ్రెస్ మోసపు మాటలతో మీ ముందుకొస్తుంది: సీఎం కేసీఆర్

  • Publish Date - November 16, 2023 / 02:28 PM IST

– 50 ఏళ్ల పాలనలో చేయలేనిది ఇప్పుడు చేస్తారా?

– సంక్షేమ పథకాలకు మారుపేరు బీఅర్ఎస్

– అసైన్డ్ భూముల‌పై కాంగ్రెస్ అస‌త్య ప్ర‌చారాలు

– న‌ర్సాపూర్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో మండిప‌డ్డ సీఎం కేసీఆర్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: 50 ఏళ్ల పాలనలో చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తదా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ప‌రంపోగు, అసైన్డ్ భూముల‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌పై ముఖ్‌్మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు.. ఈ అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు.. ఇది పూర్తి త‌ప్పుల త‌డ‌క‌, అబ‌ద్ధం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

అసైన్డ్ భూముల‌కు హక్కులిస్తాం..

‘కాంగ్రెసోళ్లు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌టంలో పెద్ద మొన‌గాళ్లు. ప‌రంపోగు భూములు, ఎవ‌రికైతే అసైన్‌మెంట్ ఇచ్చామో.. ఎస్సీలు కావొచ్చు, ఎస్టీలు కావొచ్చు, బీసీలు కావొచ్చు. వాటిని గుంజుకుంటున్నాం అని చెబుతున్నారు. ఎవ‌ర‌న్న గుంజుకుంటారా..? ఇంత అబ‌ద్ధాలు చెప్పొచ్చునా..? మొన్న‌నే ఎల‌క్ష‌న్ల మేం చెప్పినం. మేనిఫెస్టోలో కూడా చెప్పినం. ఈ అసైన్‌మెంట్ ఇచ్చిన భూముల‌కు వారికి అధికారం లేకుండా పోతుంది. మామూళ్లు వారు అయితే అమ్ముకుంటున్నరు.. కొనుక్కుంటున్న‌రు. వీళ్‌ికు కూడా కొంత‌కాలం దాటిన త‌ర్వాత ప‌ట్టా ఇవ్వాల‌ని చెప్పినం. ద‌ళిత‌, గిరిజ‌న ఎమ్మెల్యేలు కూడా ప‌ట్టాలు ఇవ్వాల‌ని కోరారు. డెఫినెట్‌గా అసైన్డ్ భూముల‌కు ప‌ట్టా చేసి హ‌క్కులు వారికే ఇస్తామ‌ని మ‌న‌వి చేస్తున్నా. అవి భూములు ఎవ‌రికి పోవు. ఈ అస‌త్య ప్ర‌చారాలు న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు. ఇది పూర్తి త‌ప్పుల త‌డ‌క అబ‌ద్ధం అని మ‌న‌వి చేస్తున్నా’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ధ‌ర‌ణి ఎత్తేయ‌డం చిన్న‌ విష‌యం కాదు..

‘కాంగ్రెస్ నాయ‌కులు ధ‌ర‌ణి తీసేస్తాం అని చెబుతున్నారు. మేం చెప్పంగ కూడా మాకు ప్ర‌జ‌లు ఓటేసిండ్రు. గ్యారెంటీగా తీసేస్తాం అంట‌రు. అప్పుడు కేసీఆర్ కూడా చేయ‌గ‌లిగేది ఏం ఉండ‌దు. మీరు ఆలోచ‌న చేయండి. ఇది చిన్న‌స‌న్న విష‌యం కాదు. అరిచేది కాదు. డెఫినెట్‌గా ఇది చాలా సీరియ‌స్ మ్యాట‌ర్. ప‌దేండ్ల నుంచి మేం క‌ష్ట‌ప‌డి, మా త‌ల‌కాయ ప‌గుల‌గొట్టుకొని, మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి ధ‌ర‌ణి తెచ్చాం. రైతుల భూములు సేఫ్‌గా ఉండాలి.. ఈ జుట్లు ముడేసి పంచాయితీ పోవాలని ధ‌ర‌ణికి రూప‌క‌ల్ప‌న చేశాం. లేక‌పోతే ఇవాళ భూముల ధ‌ర‌లు ఎంత పెరిగిన‌యి తెలంగాణ‌లో. ఇవాళ పెరిగిన ధ‌ర‌ల‌కు ఎన్ని హ‌త్య‌లు, కొట్లాట‌లు అయితుండే. ఎన్ని త‌ల‌కాయలు ప‌గిలిపోతుండే. ఎంత సీరియ‌స్ మ్యాట‌ర్ అయితుండే. ఈ విష‌యం మీరు ఆలోచించాలి. ఇవాళ మీరు ద‌ర‌ఖాస్తు పెట్ట‌కుండా, ఏ ఆఫీసు చుట్టు తిర‌గ‌కుండా నేరుగా మీ ఖాతాలో డ‌బ్బులు ప‌డుతున్నాయి. వ‌డ్లు అమ్మితే కూడా నేరుగా మీ ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతున్నాయి. ఇంత మంచి స‌దుపాయం వ‌స్తే, వాళ్లు ఉన్న‌నాడు చేయ చేత‌కాలేదు. వారికి తెలివిలేదు. ఇవాళ మేం చేస్తే దాన్ని తీసేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ ఆలోచ‌న స‌ర‌ళి ఈ విధంగా ఉంది. ఏది కావాల్నో మీరు నిర్ణ‌యించాలి’ అని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

జీవనదులుగా హల్ది…మంజీర

జీవనదులు గా హల్ది..మంజీర నదులు మారాయని మల్లన్న సాగర్ ద్వారా ఎండాకాలంలో మత్తడులు దుంకి నీళ్లు పారాయని గుర్తు చేశారు. నదులపై చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. చెక్ డ్యాంల నిర్మాణాలపై బ్యాన్ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే నన్నారు. రంగంపేటను మండలం చేయాలని, దౌలతాబాద్, కాసాలను మున్సిపాలిటీ చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను కోరారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

ఆ కాల్వ పూర్త‌యితే న‌ర్సాపూర్

వ‌జ్ర‌పు తున‌క‌లా త‌యార‌వుత‌ది

ఒకప్పుడు న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి మంచి నీళ్లు రాక‌పోయేది.. కానీ ఇప్పుడు కోమ‌టిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, న‌ర్సాపూర్ వ‌జ్ర‌పు తున‌క‌లా త‌యారవుతద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘మంజీరా న‌ది, హల్దీ న‌ది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో. ఎవ‌ర‌న్న‌ ప‌ట్టించుకున్న‌డా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు న‌దుల మీ చెక్ డ్యాంలు క‌ట్టొద్ద‌ని బ్యాన్ పెట్టిండ్రు. ఈ రోజు రెండు న‌దుల మీద చెక్ డ్యాంలు క‌డితే అవి ఇప్పుడు జీవ‌న‌దుల్లా ఉంటున్నాయి. హ‌ల్దీ వాగుకు అయితే కాళేశ్వ‌రం నీళ్లు పోసి ఎండ‌కాలంలో మ‌త్త‌ళ్లు దుంకుతున్నాయి. బ్ర‌హ్మాండంగా పంట‌లు పండుతున్నాయి’ అని కేసీఆర్ తెలిపారు.

న‌ర్సాపూర్‌లో అనేక‌మైన బాధ‌లు తీరాయి..

ఒక‌ప్పుడు న‌ర్సాపూర్‌లో మంచినీళ్ల‌కు బాధ‌లు ఉండే. కోమ‌టిబండ నుంచి మీకు మంచి నీళ్లు వ‌స్తున్నాయి. అనేక‌మైన బాధ‌లు తీరిన‌యి. ఒక‌సారి పిల్లుట్ల కాల్వ‌ అయిపోయింది అంటే బ్ర‌హ్మాండ‌మైన నీటి పారుద‌ల వ‌చ్చి న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు మంచి పంట‌లు పండిస్త‌రు. వ‌జ్ర‌పు తున‌క‌లా త‌యార‌వుతుంది. పిల్లుట్ల కాల్వ అయిపోతే నేనొచ్చి కొబ్బ‌రికాయ కొట్టి నీళ్లు తీసుకువ‌స్తాను. ఆ బాధ్య‌త నాదే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

మ‌రింత అభివృద్ధి జ‌ర‌గాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి..

కులం, మ‌తం అనే తేడా లేకుండా ముందుకు పోతున్నాం. దౌల్తాబాద్, కాసాలా మున్సిపాలిటీ కావాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా చేస్తాం.. అదేమీ గొంతెమ్మ కోరిక కాదు. రంగంపేట మండ‌లం కావాల‌ని కోరారు. దాన్ని త‌ప్ప‌కుండా చేసుకుందాం. కౌడిప‌ల్లికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశాం. ఐటీఐ త‌ప్ప‌కుండా మంజూరు చేస్తాం. న‌ర్సాపూర్‌లో చాలా చ‌క్క‌గా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. మ‌రింత అభివృద్ధి జ‌ర‌గాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. తెలంగాణ‌ను బంగారం లాగా కాపాడుకోవాలి అని కేసీఆర్ కోరారు.

మ‌ద‌న్ రెడ్డి గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌విలో ఉంటారు..

మ‌ద‌న్ రెడ్డి ఖాళీగా ఉండ‌డు. ఆయ‌న స‌ముచిత‌మైన‌, గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌విలో ఉంటారు. ఆయ‌న నాకు చిర‌కాల‌, పాత మిత్రుడు. ఇవాళ కొత్త‌గా కాదు. ఆయ‌న ఎమ్మెల్యే కావ‌డానికి నేను ఎన్నో బాధ‌లు ప‌డ్డాను. ఆ విష‌యాల‌న్నీ మీకు తెలుసు. సునీతా ల‌క్ష్మారెడ్డి, మ‌ద‌న్ రెడ్డి క‌లిసి న‌ర్సాపూర్‌ను బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేస్త‌రు. సునీతా ల‌క్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుండి చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుండి గాలి అనిల్ కుమార్, మ్యాడమ్ బాలకృష్ణ, బీజేపీ నుండి గోపి, దేష్ పాండే లు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారిని సీఎంకు పరిచయం చేశారు. అంతకు ముందు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈసభలో జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, రగోత్తం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రా గౌడ్, చైర్మన్ దేవందర్ రెడ్డి పాల్గొన్నారు.