కేసీఆర్ ఓటమి గ్రహించారు..హంగ్ వస్తే కాంగ్రెస్ బీఆరెస్‌లు కలిసిపోతాయి

  • Publish Date - November 6, 2023 / 02:03 PM IST
  • సారూ పాలనలో తెలంగాణ దివాళా
  • బీసీ సీఎం బీజేపీతోనే సాధ్యం
  • మీట్ ది ప్రెస్‌లో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీకి ఓటమి తప్పదని సీఎం కేసీఆర్ గ్రహించారని, కేవలం మేకపోతు గాంభీర్యంతోనే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం టీయుడబ్ల్యుజే బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఈటెల మాట్లాడారు. నాకు అపార అనుభవం ఉందని, అన్నీ నాకే తెలుసని, ఈ సర్వేలు ఏంటి అనే కేసీఆర్‌కు ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోతుందని అర్ధమైందన్నారు.


తనకు ఎదురులేదనుకుని, ఈ రాష్ట్రానికి నేనే ఓనర్ అన్నట్టు వ్యవహారించిన సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతనలేదని గ్రహించిన తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌కు అర్దమైందన్నారు. అమాయకంగా కనిపించే తెలంగాణ ప్రజలు హింస పెడితే, దబాయింపుకి దిగితే మౌనంగా భరిచడం అలవాటు చేసుకున్నారని, కానీ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారనేది మర్చిపోయారన్నారు.


ఇప్పుడు సీఎం కేసీఆర్‌ అహంకారం తగ్గి ప్రజల వైపు, భూమీ వైపు చూస్తున్నారని, కాని పరిస్థితి కేసీఆర్ చేయి దాటిపోయిందన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం మొదలైన తెలంగాణ ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రంలో మన నిధులు మనకోసమే ఖర్చుపెట్టినా రాష్ట్ర పురోగతి లేదన్నారు. కొత్త రాష్ట్రంలో అప్పులు తెచ్చుకొనే వెసులుబాటు ఉండేనని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ రుణాలు, ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు సాచురేశన్ పద్ధతిలో తెచ్చుకోలేదని, కొత్త రాష్ట్రంలో అప్పు తెచ్చుకొనే అవకాశం వచ్చిందని, అయితే దానిని దుర్వినియోగం చేసి 74 వేల కోట్ల అప్పును 5.5 లక్షల కోట్లకు చేశారన్నారు.


చౌరస్తాలో బిచ్చం ఎత్తుకునే బిడ్డ సైతం 1.25 లక్ష అప్పుతో పుడుతుందని, జీడీపీ కంటే 25 శాతం ఎక్కువ అప్పు చేశారన్నారు. నెలనెల జీతభత్యాలు, పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ధనిక రాష్ట్రం అయితే డబుల్ బెడ్ రూం ఇల్లు, వడ్డీ లేని రుణాలు, బిల్లులు, పెన్షన్ నెల నెల ఎందుకివ్వడం లేదన్నారు. పైగా ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకం యథేచ్చగా సాగిస్తున్న నిధులు, మద్యం రాబడి నిధులన్ని కూడా ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా దిశగానే సాగిందన్నారు.

నియామకాల విషయంలో..

రాష్టం వచ్చినప్పుడు 1.96 లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉండదని, శ్రమదోపిడీ ఉండదని, ప్రతి ఏటా నియామకాలు చేస్తామని కేసీఆర్ చెప్పారని, ఈరోజు ఆయన వైఖరితోనే 30లక్షల మంది యువత నిరుద్యోగంలో ఉన్నారన్నారు.

కోచింగ్ తీసుకుంటు అర్ధాకలితో గడుపుతున్నారని, వారిని మళ్లీ మోసం చెయ్యడానికి ఎన్నికలముందు నోటిఫికేషన్ ఇచ్చారని ఈటల ఆరోపించారు. 17 పేపర్లు లీక్ అయ్యాయని, నిరాశతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గంట చక్రపాణి హయాంలో లీకులు లేవంటారని, అడుగులకు మడుగులు ఒత్తేవారిని, బానిస మస్తత్వం ఉన్నవాళ్లతోనే పేపర్లు లీక్ అయ్యాయని, కోర్టులు కూడా రద్దు చేయమని చెప్పిన తీరుతో ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.

నీళ్లలోనూ మోసమే

ప్రాణహిత చేవెళ్ల కడితే లాభం లేదు అని మాయమాటలు చెప్పి..నా మెదడు కరగబోసి కడుతున్నానని, సూపర్ ఇంజనీర్ ను అని, ఇది మానవ అద్భుతం అని, కాంక్రీటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారి చివరకు మూన్నాళ్లకే కుంగిపోయిందన్నారు. 180 రోజులు 2 టీఎంసీల చొప్పున 360 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తామని చెప్పి, 2019 నుండి లిఫ్ట్ చేసింది కేవలం 172 టీఎంసీలు మాత్రమేనన్నారు. దానికోసం కట్టిన బిల్లులు 9 వేల కోట్లు.. బకాయిలు 6 వేల కోట్లన్నారు. మోటార్లు నడపకపోయినా 3500 కోట్లు ఫిక్స్డ్ చార్జీలు కట్టాలన్నారు. వర్షానికి కన్నేపల్లి పంపు హౌజ్ గోడలు కూలి మోటార్లు పప్పు అయ్యాయని, ప్రజాధనం తో కట్టిన వాటిని చూడడానికి అనుమతి ఇవ్వకుండా ప్రజానీకానికి సమాచారం అందకుండా ప్రజలను మోసం చేశారన్నారు.


మొన్న మేడిగడ్డలో 19-22 పిల్లర్లు కుంగాయని, ఒక్కో పిల్లర్ లక్ష మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని, 76 వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్ వాడారని, అలాంటివి కుంగి పోవడమే కాదు మధ్యకు ఇరిగిపోయాయన్నారు. 5/6 కాదు మిగతా పిల్లర్లు కింద ఇసుక పోవడం కాదు మొత్తం ప్రాజెక్ట్ వాడడానికి వీలు లేదు అని డాం సేఫ్టీ అథారిటీ చెప్తుందన్నారు. అన్నారంలో బుంగలు పడ్డాయని, ఇసుక బస్తాలు వేస్తేనో, నీళ్లు తీస్తేనో సరిపోదన్నారు. మూడు ప్రాజెక్ట్ లు రిపేర్ చేసిన పనికి వచ్చేలా లేవని, లక్ష కోట్ల డబ్బుతో కట్టిన ప్రాజెక్ట్స్ ప్రశ్నార్థకంగా మారిపోయాయన్నారు.

నిధులు..పథకాలలోనూ ద్రోహమే

దళితులు తమ కాళ్ల మీద బ్రతకాలంటే 3 ఎకరాల భూమి ఇస్తానన్నారని, ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచ్చిన ప్రభుత్వ పరమైన, దేవాలయ భూములను, గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను కేసీఆర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారన్నారు. లాండ్ పూలింగ్ పేరుతో బ్రోకర్ లెక్క అమ్ముతున్నారన్నారు. అభివృద్ధి మండలాల పేరుమీద భూములు తీసుకొని అమ్ముకుంటున్నారని, గజ్వేల్ లో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారంతా సీఎం కేసీఆర్‌ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షునికి చేసుకున్నారన్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న 5800 ఎకరాల భూమిని, 10 నుండి 50 కోట్ల విలువైన భూములను లాక్కొని ఐటీ కంపెనీలకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్నారు. కేసీఆర్ పేదలు,

ధరణి తెచ్చి దళిత, గిరిజన, పేద రైతులను భూ వివాదాల్లోకి నెట్టారన్నారు. బీసీ బంధు అడుగులకు మడుగులు ఒత్తే వారికేనని,

దళిత బంధు 2 లక్షల కోట్ల స్కీమ్ అని, నేనే కుర్చీ వేసుకొని ఇస్తా అని కేసీఆర్ చెప్పి ఇవ్వలేదని, ఏ ఊర్లో వెళ్ళినా దళితుల మధ్య కొట్లాట పెట్టారన్నారు. రింగ్ రోడ్డును 7800 కోట్లకు అమ్ముకొని, భూములు అమ్ముకొని రైతు రుణ మాఫీ చేశారని, కానీ వీరు ఇచ్చిన డబ్బు వడ్డీకే సరిపోయిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు 4800 కోట్ల బకాయి పడ్డారని, ధాన్యం కొనక పోగా, కొన్నా తరుగు పేరుతో క్విటాల్ కి 10 కేజీలు కట్ చేసి రైతులను నిలువునా ముంచారన్నారు. దళితులు, గిరిజనులు, అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్‌ వస్తె రాష్ట్రం అధిగతిపాలు అవుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయన్నారు.


ఓటమి తప్పదని తెలిసి ఓట్ల రాజకీయంలో భాగంగా బీజేపీ-బీఆరెస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఎత్తుకున్నారని, అదే నిజమైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ఈటల ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ తో బీఆరెస్‌ పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీ ఎప్పుడూ పొత్తులో లేదన్నారు. ఎన్నికల అనంతరం హాంగ్ ఏర్పడితే కాంగ్రెస్ బీఆరెస్ ఒక్కటైపోతాయిగాని కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటి కావన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను బీజేపీ మాత్రమే నిలువరించగలదని, బంగారు తెలంగాణ చేసే సత్తా బీజేపీదే అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి

ప్రధాని మోడీ పాలనలో స్కాం లేదని, దేశ ఆత్మగౌరవం పెరిగిందని, సుస్థిర పాలన అందిస్తున్నారన్నారు. 4 కోట్ల ఇండ్లు కట్టించారని, కరోనా అప్పటినుండి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని, మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు టాయిలెట్స్ 11 కోట్ల కట్టారని, తెలంగాణలో ఊర్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతో జరుగుతుందేనన్నారు. సిబ్బంది జీతాలు కూడా కేంద్రం నిధులే వాడుతున్నారని, రామగుండం ఎరువుల కర్మాగారం 6700 కోట్లు పెట్టీ పునరుద్ధరించారన్నారు.

నేషనల్ హైవే 2014 వరకు ఎంత వేశారో ఈ పదేళ్లలో అంత వేశారని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రైల్వే కనెక్టివిటి, ట్రాక్‌లు, స్టేషన్ల ఆధునీకరణ జరిగిందన్నారు.

బీజేపీతోనే బీసీ సీఎం సాధ్యం

2014 లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ లు అందరూ బీఆరెస్‌లో చేరారని, 2018 లో 19 మందినీ గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకొని సీఎం కేసీఆర్‌తో కలిసిపోయారని, ఇప్పటికీ రెండు సార్లు అదే జరిగిందన్నారు. స్వాతంత్య్రం నుండి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేరని, 52 శాతం ఉన్నాం కానీ పరిపాలన అందని ద్రాక్షగా ఉందని, అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే, రాహుల్ గాంధీ అపహాస్యం చేస్తున్నారన్నారు. గెలిపించేది రాహుల్ గాంధీ కాదు.. ఓట్లు వేసేది కాంగ్రెస్ వారు కాదు.. ప్రజలన్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీయేనని, అందుకే నవంబర్ 30 వ తేదీన బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను కోరుతున్నానన్నారు. 27 మంది బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీ, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్న కేబినెట్ నరేంద్ర మోడీ కాబినెట్ అని, మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి మోదీ అన్నారు. తెలంగాణలో 1947 నుండి ఇప్పటివరకు ఒక్క బీసీ సీఎం కాలేదన్నారు. బీఆరెస్ ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడతారని, కాంగ్రెస్ లో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాలేదన్నారు. బీజేపీ మాత్రమే బీసీని ముఖ్యమంత్రి చేస్తుందన్నారు. ఉద్యమంలో నా కమిట్మెంట్ ఏందో ప్రజలకు తెలుసన్నారు. ఆర్థిక మంత్రిగా నా విజన్ తెలుసని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అందరూ ఇంట్లో ఉంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పిన బిడ్డనని, అది నా కమిటెంట్ అని గుర్తు చేశారు. 1600 ఓట్లు ఉన్న బీజేపీనీ 1 లక్షా 7 వేల ఓట్లు ఇచ్చి హుజూరాబాద్ ప్రజలు నన్ను గెలిపించారని, ఈటలపై ప్రజలకు ఉన్న ప్రేమ ఏం కొలమానం చేస్తారన్నారు.


ఈటల వల్ల బీజేపీ పెరిగిందా తగ్గిందా మీరే భేరీజువేసుకోవాలని, నేను వేలుముద్ర మంత్రిని కాదని, తెలంగాణ ప్రజల కట్టే పన్నులు ఎంతో తెలుసని, ప్రజల అవసరం ఏంటో, సమస్యలు ఏంటో..పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో తెలిసినవాడినన్నారు. నేను పేదలకు స్కీమ్ లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, కానీ అలవికాని హామీలు ఇవ్వొద్దని, కేసీఆర్ తెలవకుండ కొడతారని, రెండు నెలలకు ఒకసారి వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముసలి దంపతులిద్ధరికి పెన్షన్ అందిస్తామని, పేదలందరికి ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. కిలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు భీమా అందిస్తామని, విద్య వైద్యం పూర్తిగా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

గజ్వేల్, హుజూరాబాద్ నాకు రెండు కండ్లు

దేశంలో ఒక వర్గాన్ని విస్మరించి ముందుకు పోలేమని ఆరెస్‌ఎస్ చెప్పిందని, గల్ఫ్ దేశాలలో మంచి సంబంధాలు ఉన్న దేశం మనదని, మైనారిటీలకు కూడా విశ్వాసం కలిపించిన నాయకుడు మోదీ అని, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మా నినాదమన్నారు. గజ్వేల్‌, హుజూరాబాద్‌లలో రెండుచోట్ల గెలుస్తానని, అవి రెండు నాకు రెండు కండ్లు అన్నారు. జనసేన పొత్తు అవసరం అని పార్టీకి అనిపించడంతో పొత్తు పెట్టుకుందన్నారు. మాకు బలం లేని దగ్గర వారికి సీట్లు ఇస్తున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీ 61సీట్లకుపైన గెలుస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.