షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది : సీఎం కేసీఆర్

షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి వ‌ర‌కు మెట్రో వ‌స్తే మీ భూముల ధ‌ర‌లు మూడింత‌లు పెరుగుతాయి

  • Publish Date - November 27, 2023 / 09:35 AM IST

విధాత‌ : షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి వ‌ర‌కు మెట్రో వ‌స్తే మీ భూముల ధ‌ర‌లు మూడింత‌లు పెరుగుతాయి. అంతేకాకుండా చాలా విద్యాసంస్థ‌లు, కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని కేసీఆర్ తెలిపారు. షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.


అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క లాంటి మ‌నిషి. ఆయ‌న చీమ‌కు దోమ‌కు కూడా అన్యాయం చేసే మ‌నిషి కాదు. ఇలాంటి ఎమ్మెల్యే చాలా త‌క్కువ ఉంట‌రు రాష్ట్రం మొత్తంలో. మొద‌ట్నుంచి నాతో పాటు న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. ఇవాళ వ‌ర‌కు ఎలాంటి చెడ్డ ప‌ని చేయ‌లేదు. నా నియోజ‌క‌వ‌ర్గం నాకు కావాల‌ని తండ్లాడుతాడు. అంజ‌య్య లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్‌న‌గ‌ర్‌కు ఏదంటే అది వ‌స్త‌ది. మీరు సిటీ ప‌క్క‌కే ఉన్నారు. మేం మెట్రో రైలు గురించి ఆలోచ‌న చేస్తున్నాం. షాద్‌న‌గ‌ర్ దాకా మెట్రో రావాల‌ని అంజ‌య్య యాద‌వ్ ప‌ట్టుబ‌ట్టారు. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో పెట్టించారు. షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో తీసుకొచ్చే బాధ్య‌త నాది. మీరు అంజ‌య్య‌ యాద‌వ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒక మెడిక‌ల్ కాలేజీ రావాల‌ని కోరారు.


నేను త‌ప్ప‌కుండా మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేస్తాను. పీజీ కాలేజీలు కొన్ని అడిగారు. మీకు చాలా విద్యాసంస్థ‌లు వ‌స్తాయి హైద‌రాబాద్ ప‌క్క‌కే ఉంట‌ది కాబ‌ట్టి. ఒక‌సారి మెట్రో వ‌స్తుంద‌ని తెలిస్తే మీ భూముల ధ‌ర‌లు మూడింత‌లు పెరుగుతాయి. అన్ని విద్యాసంస్థ‌లు వ‌స్తాయి. కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లు కూడా త‌ర‌లివ‌స్తాయి. దండం పెట్టుకుంట వ‌స్తాయి. షాద్‌న‌గ‌ర్‌కు మెట్రో వ‌స్తుంద‌ని తెలిసిన త‌ర్వాత దీనికి డిమాండ్ తారాజువ్వాలా లేచిపోయింది. హైద‌రాబాద్ సంక‌లో ఉన్నారు కాబ‌ట్టి.. అంజ‌య్య లాంటి ఎమ్మెల్యే ఉంటే ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డే ఎమ్మెల్యే ఉంటే మీ కోరిక‌ల‌న్నీ నెర‌వేరుతాయి అని కేసీఆర్ తెలిపారు.


ల‌క్ష్మీదేవిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ గురించి ఆనాడు న‌న్ను ఎవ‌రూ అడ‌గ‌లేదు. చెప్ప‌లేదు. తెలంగాణ ఉద్య‌మంలో నేను క‌నిపెట్టిన పాయింట్. తెలంగాణ‌లో హైయేస్ట్ పాయింట్ కొందుర్గు మండ‌లంలోని మ‌న‌ ల‌క్ష్మీదేవిప‌ల్లి. అక్క‌డ రిజర్వాయర్ వ‌స్తే నెత్తి మీద కుండ‌లా ఉంటుంది. ఇదే కాంగ్రెస్ నాయ‌కులు పాల‌మూరు ఎత్తిపోత‌ల‌పై గ్రీన్ ట్రిబ్యున‌ల్‌కు వెళ్లి స్టేలు తీసుకొచ్చి, 196 కేసులు పెట్టారు. చాలా కాలం కొట్లాడిన త‌ర్వాత కేసులు క్లియ‌ర్ అయ్యాయి. ఒక పంపు హౌస్ ప్రారంభించుకున్నాం. ఇక్క‌డ పెద్ద‌వాగు మీద క‌ట్టేది కాదు ల‌క్ష్మీదేవిప‌ల్లి రిజర్వాయ‌ర్. అది రింగ్ బండ వేసుకుని క‌ట్టుకుంటాం. అది నిమిషాల్లో అయిపోత‌ది పెద్ద స‌మ‌స్య కాదు. మీకు ఎక్కువ భూములు మున‌గ‌కుండా, త‌క్కువ భూములు మునిగేలా ఆ రిజర్వాయ‌ర్ తెచ్చి ఇచ్చే బాధ్య‌త నాది. తెలంగాణ ఇరిగేష‌న్‌లో అది నా ప్లాన్. అది ఎన్న‌టికైనా రావాల్సిందే. ఒక పూట వెనుక ముందు. ఈసారి మ‌న‌మే గెలుస్తున్నాం. ఈసారి త‌ప్ప‌కుండా ఆ ప‌నులు స్టార్ట్ చేయిస్తాన‌ని మ‌న‌వి చేస్తున్నా. ఉద్ధండ‌పూర్ నుంచి కూడా మీకు నీళ్లు వ‌స్తాయి. సాగు నీళ్ల బాధ కూడా త‌ప్పుత‌ది అని కేసీఆర్ తెలిపారు.


అనేక ర‌కాలుగా షాద్‌న‌గ‌ర్ అభివృద్ధి కావ‌డానికి అవ‌కాశం ఉంది. అదే కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగ‌మై పోయే అవ‌కాశం ఉంటుంది. అంజ‌య్య యాద‌వ్ అజాత శ‌త్రువు. ఈగ‌కు, దోమ‌కు కూడా అన్యాయం చేసే మ‌నిషి కాదు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్త‌డు. ఇక్క‌డే ఉంట‌డు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంట‌డు. ఇటువంటి మంచి మ‌నిషిని గ్యారెంటీగా కాపాడుకోవాలి. ఇక్క‌డ అభివృద్ధి బాధ్య‌త వంద‌కు వంద శాతం నాది. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది. అందులో అనుమానం అవ‌స‌రం లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.