విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే రాష్ట్రం ఆగమవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో తోడేల్లా ఎదురు చూస్తున్నదని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి తెలంగాణపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఐదు గంటల కరెంటే కర్ణాటకలో ఇస్తున్నామని చెప్పి ఆయన తన ఇజ్జత్ తానే తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక మంత్రులు తెలంగాణ కు సుద్దులు చెప్పడం మానుకోవాలని సూచించారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉద్యమంలో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే.. తామే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడానికి సిగ్గుండాలని సీఎం కేసీఆర్ విమర్శించారు. చెరుకు సుధాకర్‌ను జైల్లో వేసి హింసించారని, శంకరమ్మ లాంటి తల్లులు తెలంగాణ కోసం త్యాగం చేశారని చెప్పారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే బీఆరెస్ అన్నారు.
నాగార్జునసాగర్ నిర్మాణంలో గోల్‌మాల్ చేశారు
నాగార్జున సాగర్ ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా ఇంకో 20 కిలోమీటర్ల ఎత్తులో కట్టాల్సి ఉండగా ఆనాడు గోల్ మాల్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేశారని అప్పటి పాలకులపై కేసీఆర్వి రుచుకుపడ్డారు. సాగర్ కాల్వల నుండి సాగునీటిిని విడుదల చేసి సాగర్ ఆయకట్టుకు మరోసారి పంటకు నీళ్లు విడుదల చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాల క్రితమే కృష్ణానదిలో కాళేశ్వరం జలాలు కలిపేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రెండు పంటల సాగుకు కృష్ణానదికి గోదావరి జలాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బీఆరెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓటర్లు అర్ధం చేసుకోవాలని, కోదాడలో బీసీ బిడ్డ బొల్లం మల్లయ్య యాదవ్‌కు భారీగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కోదాడలో బీసీలకు ఎప్పుడూ అవకాశం రాలేదని.. ఇప్పుడు బీసీలకు అవకాశం కల్పించాలని స్వయంగా మల్లయ్యను పిలిచి సీటు ఇచ్చానని తెలిపారు. గెలవడని ఎంతమంది చెప్పినా తానే టికెట్ ఇచ్చానని చెప్పారు. కోదాడలో ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు బీసీలు ఐక్యమై, బిడ్డకు అండగా నిలవాలని కోరారు. కోదాడలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నందున మల్లయ్య యాదవ్‌ను గెలిపిస్తే రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
నీటికోసం పాదయాత్ర చేశా
నీటి కోసం కోదాడ నుండి హాలియా వరకు రెండో పాదయాత్ర చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నడిగూడెం, మునగాల, మోతె మండలంలో కాళేశ్వరం జలాలు వచ్చాయన్న కేసీఆర్.. బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కకు అవి ఎందుకు కనబడలేదని ప్రశ్నించారు. కరెంటు 24 గంటలు కావాలా 3 గంటలు కావాలా తేల్చుకోవాలన్నారు. రైతుబంధు వేస్టని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, రాహుల్ గాంధీ, భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి ధరణి తీసివేయాలని అంటున్నారని మండిపడ్డారు. ధరణితోనే రైతుబంధు, రైతు భీమా, ధాన్యం అమ్మిన డబ్బులు సక్రమంగా వస్తున్నాయని వెల్లడించారు. రైతు బంధు వద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డినా… రైతుబంధు కావాలని చెప్తున్న మల్లయ్య యాదవ్ కావాలో తేల్చుకోవాలన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1లో ఉందన్నారు. కోదాడలో బీసీ, బలహీనవర్గాలు, దళితుల, ముస్లింలు, లంబాడీల చైతన్యం ఈ ఎన్నికల్లో చూపించాలని కోరారు. బలిసిన వారి కుట్రలను ఓడించి, మల్లయ్య యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సూర్యాపేట, కోదాడ మధ్యలో డ్రైపోర్టు రానుందని చెప్పారు.
మూడోసారి తుంగతుర్తిలో అభివృద్ధి కోసం కిశోర్‌ను గెలిపించాలి
తెలంగాణలో మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి గాదరి కిశోర్‌ను మూడోసారి గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలను కోరారు. ఉద్యమ రోజుల్లో గోదావరి జలాలకోసం కమ్యూనిస్టు యోధుల పేర్లు గోడలపై కనిపించేవని, ప్రస్తుతం చెరువులు అన్ని మత్తడి దుంకుతున్నాయని అన్నారు. కాళేశ్వరం జలాలు బస్వాపూర్, బునాదిగాని కాలువకు అనుసంధానం అవుతున్నాయని చెప్పారు. త్వరలో మరో రెండు లక్షల ఎకరాలు సస్యశ్యామలం కాబోతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో 30వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మించుకుంటున్నామని చెప్పారు. గాదరి కిశోర్‌ను తుంగతుర్తిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కిశోర్ మళ్లీ గెలిస్తే.. నియోజకవర్గంలో దళితులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.