రాష్ట్ర రైతులకు పెద్ద ప్రమాదం రాబోతుంది: సీఎం కేసీఆర్

  • Publish Date - November 13, 2023 / 02:12 PM IST

– కాంగ్రెస్ నేతలతో ఈ ముప్పు పొంచి ఉన్నది

– ప్రజాస్వామ్యంలో పరిణితి అవసరం

– రాహుల్ కు ఎద్దు తెలుసా, ఎవుసం తెలుసా

– కాంగ్రెస్ రైతు బంధు, ధరణి వద్దంటున్నారు

– మూడు గంటల కరెంటు చాలంటున్నారు

– అభివృద్ధి సాగాలంటే బీఆర్ఎస్ గెలువాలి

– షర్మిల తొలిసారి స్పందించిన సీఎం కెసిఆర్

– తలసరి విద్యుత్ వినియోగంలో ఫస్ట్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో రైతులకు పెద్ద ప్రమాదం రాబోతోందని బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, ధరణ పోర్టల్ రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామంటూ ఖుల్లం ఖుల్లా చెబుతున్నారని అన్నారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఎద్దెరుకనా? ఎవుసం ఎరుకనా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి రాబోయే ఈ పెద్ద ప్రమాదం రాకుండా ఉండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమం సాగాలంటే బీఆర్ఎస్ గెలువాలని, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేటలో సోమవారం బీఆర్ఎస్ చేపట్టిన ప్రజా ఆశీర్వాద బహిరంగకు కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.


– రైతు బంధు దుబారా అంటున్నారు


రైతు బంధుతో ప్రజల సొమ్ము దుబారా అవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని చెప్పారు. రైతు బంధు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్, ఇపుడు 10వేలు ఇస్తున్నాం, రాబోయే కాలంలో రూ.16వేలిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు ఉండాలా? వద్దా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు.


– ధరణి తొలగిస్తే మళ్లీ దళారులే


ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటూ ఆ పార్టీ నేత రాహుల్ తో పాటు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అంటున్నారని కెసిఆర్ విమర్శించారు.రైతుల కోసం ధరణి తెచ్చాం…రైతుల భూములపై రైతులకే హక్కుండేందుకు ధరణి తీసుకొచ్చామన్నారు. ధరని తొలగిస్తే మళ్ళీ వీఆర్వోలు, గిరిదావర్లు, తహసిల్లాదర్ల దగ్గరకు పోవాల్సి ఉంటుందని వారు డబ్బులు గుంజుతారని విమర్శించారు. ధరణి తేవడం వల్ల రైతు బంధు, రైతు భీమా, ధాన్యం కొన్న డబ్బులు సరాసరి మీ అక్కౌంట్లో వేస్తున్నామని వివరించారు. ధరణి తొలగిస్తే దళారీలపాలవుతోందని వైకుంటపాలీలో పెద్ద పాము మింగినట్లైతదని హెచ్చరించారు.


– మూడు గంటల కరెంట్ చాలట


రైతుల కోసం తాము కష్టపడి 24 గంటల కరెంట్ ఇస్తుంటే మూడుగంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని కెసిఆర్ విమర్శించారు. 10 హెచ్ పి మోటార్లు పెట్టాలంటున్నాడని, వ్యవసాయానికి 10 హెచ్ పి మోటార్లు వాడుతారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30వేల కనెక్షన్లకు 10 హెచ్ పి మోటార్లు ఎవరు కొనిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉండాలా? వద్దా? అంటూ ప్రశ్నించారు. 24గంటల కరెంట్ కావాలంటే సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్నారు.


– ప్రజాస్వామ్యంలో పరిణతి అవసరం


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో పరిణతి అవసరమని కెసిఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయీ…పోతాయీ కానీ, ప్రజలు గెలువాలంటే ఆలోచించి ఓటు వేయాలన్నారు. నిలబడ్డ నాయకుల నడక, నడతతో పాటు ఆయన వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలన్నారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలముందున్నదన్నారు. ఉన్నతెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులున్నా మంచినీళ్ళెందుకు ఇంత కాలం ఇవ్వలేదని, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, కరెంట్ లేక పడిన అవస్థలు ఉన్నాయన్నారు. ఈ కష్టాలన్నింటని ఒక్కొక్కటి తొలగించామని గుర్తు చేశారు. అందుకే ఓటేసేముందు ఆలోచించాలని, అందుకే ప్రజాస్వామ్యంలో పరిణతి అవసరమని చెప్పానన్నారు. ఐదేండ్లలో ఇంటింటికి మంచినీళ్ళిచ్చేందుకు మిషన్ భగీరథ అమలు చేశామన్నారు. రాత్రి కరెంట్ కు చరమగీతం పాడి ఎక్కడలేని విధంగా 24 గంటల కరెంట్ తెచ్చామన్నారు. గంగానది ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఇంటింటికి నీరులేదని, ప్రధాని రాష్ట్రమైన గుజరాత్ లో 24గంటల కరెంట్ ఇవ్వడంలేదన్నారు.


– షర్మిల డబ్బు సంచులు కావాలా?


సమైక్యవాది షర్మిలను అడ్డకున్నాడని పెద్ది పై పగబట్టి ఆయనను ఓడించేందుకు ఆమె డబ్బులు పంపిస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. డబ్బు సంచులు కావాలా? మీ ప్రాంత అభివృద్ధికి పాటు పడిన సుదర్శన్ రెడ్డి కావాలా? అంటూ ప్రశ్నించారు. మీ కోసం పనిచేసే నాయకున్ని గెలిపించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో వచ్చీపోయే టూరిస్టు నాయకులు కావాలా? నిరంతరం మీ కోసం పనిచేసే పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు కావాలా? అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. గోదావరి జలాలను పాకాల ఆయకట్టుకు తీసుకొచ్చిన ఘనత ఆయనదన్నారు. 35వేల ఎకరాల ఆయకట్టు ఇప్పుడు లక్షా 35వేలకు చేరిందన్నారు. మెడికల్ కాలేజీ తెచ్చిన ఘతన తనదన్నారు. ఇంటింటికి గ్యాస్ తీసుకొచ్చారన్నారు.


– తలసరి విద్యుత్ వినియోగంలో ఫస్ట్


తలసరి ఆదాయంతో పాటు, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ముందున్నదని సీఎం కెసిఆర్ అన్నారు. కెసిఆర్ 24 గంటలిస్తుంటే ఐదుగంటలు సరిపోతాయని కర్నాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. గతంలో కర్నాటకలో 12 గంటలిస్తే ఇప్పుడు 5గంటలిస్తున్నారని విమర్శించారు.కాళేశ్వరంతో 270 చెరువులు నింపుకున్నామని, రాష్ట్రంలో ప్రస్తుతం 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుండగా రానున్న రోజుల్లో మిగిలిన ఒకటిరెండు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే 4కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదుగుతుందన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.