60 ఏళ్ల‌లో ఏం వెల‌గ‌బెట్టారు?..ఒక్క చాన్స్ ఇవ్వాలంటున్న‌రు

ఎన్నిక‌లు రాగానే ఆప‌ద‌మొక్కుల వారు వ‌స్తార‌ని కాంగ్రెస్‌, బీజేపీని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి, బీఆరెస్ అధినేత‌ కే చంద్ర‌శేఖ‌ర్‌రావు వ్యాఖ్యానించారు.

  • ఇక్క‌డి నుంచి ఢిల్లీ దాకా..
  • మీకు ప‌ది చాన్సులు ఇచ్చారుగా!
  • ఆప‌ద మొక్కుల‌వారితో జాగ్ర‌త్త‌
  • ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు
  • రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి
  • ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు
  • హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల శంఖారావం

విధాత : ఎన్నిక‌లు రాగానే ఆప‌ద‌మొక్కుల వారు వ‌స్తార‌ని కాంగ్రెస్‌, బీజేపీని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి, బీఆరెస్ అధినేత‌ కే చంద్ర‌శేఖ‌ర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కూ కాంగ్రెస్‌కు ప‌దిచాన్సులు ఇస్తే అర‌వై ఏళ్ల‌లో ఏం వెల‌గ‌బెట్టార‌ని కాంగ్రెస్‌నుద్దేశించి ప్ర‌శ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల శంఖారావం పూరించారు. గ‌త రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఈసారి కూడా అదే సంప్ర‌దాయాన్ని పాటిస్తూ.. ఇక్క‌డ నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘మీ అందరినీ కోరేది ఒకటే. ఎలక్షన్లు రాంగనే ఎవరో వస్తరు.. ఏదో చెబుతరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు. అలవిగాని సామెతలు చెబుతరు.

ఆపదల మొక్కులు కూడా మొక్కుతరు.. తీర్థం పోదంపా తిమ్మక్క అంటే.. నువ్వు గుల్లె.. నేను సల్లే.. యాడికి తోలుకపోతరో తెల్వదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నయ్‌. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అంటున్నయ్‌. మీకు పది చాన్స్‌లు ఇచ్చారు కదా.. 60 ఏళ్లు రాజ్యం మీరే వెలుగబెట్టారు కదా? ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి.

మనందరికీ సిగ్గుచేటు’ అన్నారు. ఎన్నిక‌లు రాగానే ఆగం కావొద్ద‌ని, రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాల‌ని కోరారు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో తాను ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌సంగించాన‌ని, హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించామ‌ని కేసీఆర్ చెప్పారు. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పార‌ని, అందుకే హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, పార్టీ మ్యానిఫెస్టో ప్ర‌క‌టించి.. మీ దర్శనానికి వచ్చాన‌ని అన్నారు. ఈ స‌భ‌లో తాను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్ద‌ని, మీమీ పట్టణాలు, బస్తీలు, గ్రామాలు, తండాల‌కు పోయిన తర్వాత కేసీఆర్‌ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాల‌ని కోరారు.

సుట్టం చెప్పాడని ఓటు వేయొద్దు..

‘ఎన్నికలు వస్తుంటయ్‌ ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి. మనకు పనికి వచ్చేది ఏదో గుర్తు పట్టాలి. ఎవరో చెప్పారని అవలోకగా వేయొద్దు. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఓటు తాలూక రాత, జిల్లా రాతను, రాష్ట్రం భవిష్యత్తును మారుస్తుంది. మా బావమరిది చెప్పిండు.. మా సుట్టం చెప్పండ‌నో.. మా మేనమామ చెప్పండనో ఓట్లు వేయకూడదు. క‌చ్చితంగా ఆలోచించి స్పష్టమైన అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి’ అని కేసీఆర్ చెప్పారు. ‘తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఎలా ఉండే ఎలా ఉండే.. ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీరు లేదు. కరెంటు లేదు. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు. కొత్తకుండలో ఈగచొచ్చినట్లు కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి. ఎక్కడికి తీసుకుపోయావాలి.. ఏవిధంగా పైకి వెళ్లాలని.. రాష్ట్రంలో ఉన్న యావత్‌ ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే జటిలమైన సమస్య నా ముందు ఉండేది’ అన్నారు.

కుట్రలు చేసినా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం..

‘తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్‌ఎస్‌మీదనే ప్రజలు పెట్టారు. చాలా బాధ్యతగా పెద్ద ఆర్థిక నిపుణులు రాష్ట్రానికి చెందిన, బయట రాష్ట్రాలకు చెందిన రప్పించి రెండుమూడు నెలలపాటు మేధోమథనం చేశాం. ఎక్కడ ఉన్నాం.. ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి? ఎక్కడ చూసినా కటిక చీకటి. నీళ్లు లేవు. పంటలు పండవు.. బతుకలేక వలసపోయిన వారు కొందరు.. ఇక్కడే ఒంటి సావలేక బతుకుతున్న వారు కొందరు. చాలా ఘోరమైన పరిస్థితులుండేవి. మీ అందరికీ తెలుసు. 14-15 సంవత్సరాలు ఏకబిగిన పోరాడి తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో అందరి సహకారంతో నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకుపోయాం. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో, మంచినీటి రంగంలో, పల్లెల్లో పచ్చదనం, పారిశుధ్యం ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. పారిశ్రామిక విధానంలో మనకు ఎవరూ పోటీలో లేరు. సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో, 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో, పారిశ్రామిక విధానం, ఐటీ రంగంలో నెంబర్‌ వన్‌గా ఉన్నాం. కేంద్రం సహకారం లేకపోయినా.. ప్రతిపక్షాలు గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేసినా, కుట్రలు చేసినా అధిగమించుకుంటూ ఒకటిఒకటి చేసుకుంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాం’ అని వివరించారు.

దేశం మొత్తం తలదించుకోవాలి..

‘75 సంవత్సరాల తర్వాత కూడా మన దళితులు పేదరికంలో ఉన్నారంటూ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. 60-70కిందట దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండుంటే ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది? ఇవాళ ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నారో.. వారికి 10-12 ఛాన్సులు ఇచ్చారు. వాళ్లు ఏమీ చేయలేదు. పెన్షన్లు ఇచ్చారు.. ఎన్ని ఇచ్చారు? మనం రూ.40, రూ.70, రూ.200 పెన్షన్లను చూశాం. నేను ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? దానికి ఏమైనా పర్పస్‌ ఉందా? అని అడిగాను. పెన్షన్‌ను రూ.400 చెద్దామని నిపుణులు చెప్పారు. పెన్షన్లు ఇచ్చేందుకు కారణం చేత ఇస్తామని అడిగాను.

దురదృష్టవశాత్తు మానవ సమాజంలో కొందరు విధి వంచితులు ఉంటారు. మంచిగున్న మనిషి కూడా ప్రమాదంలో దివ్యాంగులు కావొచ్చు. కొందరు పుట్టుక‌తోనే దివ్యాంగులు కావొచ్చు. కొందరు ఆలనా పాలనలేని స్త్రీలు, వృద్ధులుంటారని ఆలోచించించాం. ఆఫీసర్లు రూ.650 వరకు ఇవ్వాలని చెప్పినా వినకుండా రూ.1000 పెన్షన్‌ ఇచ్చాం. టర్మ్‌ తిరిగే సరికి రూ.2000వేలకు పెంచాం. మళ్లీ పెన్షన్‌ను రూ.5వేల పెంచబోతున్నట్లు ప్రకటించాం. ఓట్ల కోసం ఒకటే రోజులో ఇస్తామని చెప్పలేదు. గవర్నమెంట్‌ రాగానే పెన్షన్‌ను రూ.3వేలకు పెంచుతాం. రూ.500 పెంచుకుంటూ ఐదుసంవత్సరాలు పూర్తయ్యే సరికి రూ.5వేలకు పెంచుకుంటూ పోతాం’ అని తెలిపారు.

ఒడ్లు పట్టుకొని నీళ్లు కనిపిస్తున్నయ్‌..

రైతుబంధు ఎవరూ అడగక‌పోయినా ఇచ్చామ‌ని కేసీఆర్ చెప్పారు. ‘రైతుబంధు ఇవ్వాలని గతంలో ఎన్నడూ లేదు. గతంలో లోన్‌ డబ్బులు కట్టకపోతే దర్వాజలు పీక్కుపోయేది. రైతులు ఊళ్లల్లో నుంచి పారిపోయేది. రైతులను నిటబెట్టాలని, ప్రభుత్వం సపోర్ట్‌ లేకుండా రైతు నిలబడడని రైతుబంధు తీసుకువచ్చాం. రూ.10వేలు ఇస్తున్నాం. నేను ఇవాళ ప్రకటించా.. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు మారాయి. గతంలో హుస్నాబాద్‌కు వస్తే కండ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎక్కడ చూసినా బొగ్గునాల బొగుడ. పంటలు ఉండేది కాదు. ఏసిన మామిడి, బత్తాయి చెట్లు ఎండిపోతుండే. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండలతో నీళ్లు పోసి కాపాడుకున్నటువంటి దుస్థితి ఉండేది.

600-700 ఫీట్లు వేస్తే బోరుపడేది కాదు. హుస్నాబాద్‌ వాగుమీద ఒక్క చెక్‌డ్యామ్‌ ఉండేది కాదు. నీళ్ల చుక్క కనిపించేది కాదు. ఇవాళ హెలికాప్టర్ల నుంచి రెండుమూడు చెక్‌డ్యామ్‌లు వరుసగా కనిపిస్తున్నయ్‌. రెండు ఒడ్లు పట్టుకొని నీళ్లు కనిపిస్తున్నయ్‌. ఈ పద్ధతుల్లో మిషన్‌ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, కరెంటు పరిస్థితి మంచిగ చేసుకున్నాం. ఇవాళ ఓట్లు అడిగేటోళ్ల జమానాలో కరెంటు పరిస్థితి ఎట్లుండే? 50ఏళ్లు రాజ్యం చేసినోళ్ల కాలంలో ఏ పరిస్థితుల్లో ఉండే? ట్రాన్స్‌ఫార్మర్లు కాలుడు.. మోట‌రు కాలుడు.. పంట పండేలోపల.. మోటరు కాలుడు.. వచ్చిన నాలుగు రూపాలు దానికే పోవుడు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిదంటే గతంలో బాయికి రూ.2వేలు, రూ.3వేలు వసూలు చేసేది. ఇప్పుడా పరిస్థితులు తెలంగాణలో లేవు’ అని వివరించారు.