ధ్యాస మరిస్తే గోస పడతాం..కాంగ్రెస్ వస్తే 60 ఏళ్లు వెన‌క్కి

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌ 60 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు హెచ్చ‌రించారు.

  • గ‌తంలో పాలమూరును చూస్తే దుఃఖం వచ్చేది
  • అంబలి, గంజి కేంద్రాల‌తో గుండె తరుక్కుపోయేది
  • తెలంగాణలో ఆ సమస్యలు దూర‌మ‌య్యాయి
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్ళీ ఆగమ‌వుతాం
  • జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌ 60 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు హెచ్చ‌రించారు. ఒక‌ప్పుడు పాల‌మూరు జిల్లాను చూస్తే దుఃఖం వ‌చ్చేద‌ని, ఇక్క‌డి గంజి కేంద్రాలు చూస్తే గుండె త‌రుక్కుపోయేద‌ని చెప్పారు. అలాంటి పాల‌మూరును అభివృద్ధి బాట ప‌ట్టిస్తే.. ఇక్క‌డి కాంగ్రెస్ ద‌ద్ద‌మ్మ‌లు ఓర్వ‌లేక త‌మ‌పై దుమ్మెత్తి పోస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. అలాంటి నాయ‌కులు ఈ జిల్లాలో ఎలా పుట్టారో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ స‌న్నాసులు అడ్డంపొడువు మాట్లాడుతున్నార‌ని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. 60 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోతామ‌ని హెచ్చ‌రించారు. బుధ‌వారం ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. తాను రైతునేన‌ని, రైతుల బాధ‌లు తెలుస‌ని చెప్పారు. అందుకే రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాన‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా రైతుల‌ను ఆదుకుంటుంటే.. వాడొక‌డు.. వీడొకడు.. తలమాసినోడు తలో మాట అంటున్నారని, అలాంటి వారు అవసరమా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. రైతుబంధు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్క‌డా లేద‌ని చెప్పారు.

పాలమూరు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మూడు నెల్లల్లో జడ్చర్లకు సాగునీరు అందిం, 1.50లక్షల ఎకరాలు ప‌చ్చ‌బ‌డ‌తాయ‌ని సీఎం చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. జూరాల నుంచి నీరు తీసుకోవాలని కాంగ్రెస్ దద్దమ్మ లు అంటున్నారని, ఈ ప్రాజెక్టు నుంచి ఈ ఎత్తిపోతలకు నీరు తీసుకుంటే బెత్తడు నీరు కూడా ప్రాజెక్టులో మిగలవనే విషయం కూడా తెలియని సన్నాసులు ఈ జిల్లా ఉన్నారని కేసీఆర్‌ దుయ్యబట్టారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే పాలుగారే జిల్లాగా పాలమూరు మారుతుందన్నారు. రైతుబంధుతో ఇక్కడి రైతుల ముఖాలు తెల్ల‌బడ్డాయని అన్నారు. దుందుబి నదిలో ఒక‌ప్పుడు దుమ్ము ఉండేదని, ఇప్పుడు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ద‌ని తెలిపారు.



 


క‌ర్ణాట‌క‌లో 5 గంట‌ల క‌రెంటే

ఈ మధ్య కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అక్కడి రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్న‌ద‌ని కేసీఆర్ చెప్పారు. కానీ.. ఇక్కడ 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. ఇంత సమయం కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదని, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా లేదన్నారు. తెలంగాణలో కులం, మతం లేదని, ఇక్కడ గంగా జమునా తెహ‌జీవ్ ఉన్న‌ద‌ని చెప్పారు. వచ్చే ఎన్నికలకు తాము ప్రకటించినది లంగ మ్యానిఫెస్టో కాదని, అందరికీ ఆమోదం ఉండేద‌ని అన్నారు.

ఒక‌ప్పుడు పాల‌మూరును చేస్తే దుఃఖం వ‌చ్చేది

ఒకప్పుడు జయశంకర్ సార్‌తో కలిసి పర్యటన చేస్తుంటే ఇక్కడి పొలాలు, ఇక్కడి ప్రజల కష్టాలు చూస్తే దుఃఖం వచ్చిందని, క‌రెంటు క‌ష్టాలు చూసి గుండె బ‌రువెక్కేద‌ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరులో అంబలి, గంజి కేంద్రాల ఏర్పాటు చూసి గుండె తరుక్కు పోయేదని అన్నారు. తాను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పుణ్యానికి రాలేదని, ఎందరో బలిదానాలతో వచ్చిందని, తాను కూడా చావు నోట్లో తల పెట్టివచ్చానన్నారు. తెలంగాణ వచ్చాక‌ పాలమూరు జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ జిల్లాకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించి ఆదుకున్నామన్నారు. అగ్రవర్ణ నాయకులు కలిసి, త‌మ‌లో ఉన్న పేదలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారని, వారి కోసం ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లక్ష్మా రెడ్డి కోరినట్లు జడ్చర్ల కు ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఎన్నికల తరువాత జీవో ఇస్తామని తెలిపారు. అలాగే ఉద్ధాండాపూర్ జలశయంలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తామన్నారు.

వారికి ఇదివరకే ఇచ్చేది ఉండేన‌ని, కానీ.. కొన్ని టెక్నిల్ సమస్యల వల్ల ఇవ్వలేక పోయామని చెప్పారు. జడ్చర్లకు సెజ్ తెచ్చి, ఇక్కడి యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత లక్ష్మా రెడ్డికే దక్కిందన్నారు. త్వరలో ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇక్కడి ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి తనతో పాటు ఉద్యమంలో నడిచిన నేత అని, ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే ఆయన గెలినట్లేన‌ని కేసీఆర్ చెప్పారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లు, పెద్ద సంఖ్య‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.