వరంగల్ స్థానంపై సీఎం నజర్

వరంగల్ ఎంపీ స్థానం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్రీకరించారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న తాజా పరిస్థితి, సర్వే రిపోర్టులు, విపక్షాల స్థితిగతులను వివరించి

  • Publish Date - April 7, 2024 / 08:44 AM IST

అభిప్రాయ బేధాలు పక్కన పెట్టాల్సిందే

అలసత్వం వహిస్తే మొదటికే మోసం

పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాలకే కావ్యకు టికెట్‌

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం..

ఆ దిశగా ఎక్కువ సీట్లలో కాంగ్రెస్‌ గెలవాలి

నాయకులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం!

ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం

ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు హాజరు

ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై పరిశీలన

విధాత ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఎంపీ స్థానం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్రీకరించారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న తాజా పరిస్థితి, సర్వే రిపోర్టులు, విపక్షాల స్థితిగతులను వివరించి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు అవసరమైన వ్యూహాన్ని రచించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ కావ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముందుగా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితి, ముఖ్యంగా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన అరూరి రమేశ్‌కు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చించారు. రమేశ్‌ బరిలో ఉంటున్నందున బీఆర్ఎస్ పై ఏ మేరకు ప్రభావం పడుతోందనే చర్చ సాగినట్టు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయనందున ఎవరి వైపు ఆ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపే అవకాశం ఉందనే అంశాలు ఆరా తీశారని సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్‌లో, అటు బీఆర్ఎస్ నెలకొన్న తాజా పరిస్థితిని ఆరా తీశారని తెలిసింది.

కడియం కావ్యను అభ్యర్థిగా నిర్ణయించాల్సిన పరిస్థితులను ఒక మేరకు వివరించి, పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ చర్య తీసుకున్నట్లు నేతలకు వివరించారని సమాచారం. కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రమించి, టికెట్ ఆశించిన దొమ్మాటి సాంబయ్య లాంటి వాళ్ళను నచ్చచెప్పినట్లు చెబుతున్నారు. పార్టీ సముచిత స్థానం ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని, రాహుల్‌ను ప్రధాని చేయాలనే పట్టుదలతో పనిచేయాలని సూచించారు. విభేదాలకు, అసంతృప్తులకు, అసమ్మతికి తావివ్వకుండా ఫలితాలు వచ్చే వరకు కలిసికట్టుగా శ్రమించాలని సూచించినట్టుగా చెబుతున్నారు. వరంగల్ ఎంపీ సీటులో ఏకపక్షంగా విజయం సాధిస్తామని, ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానల్లో మన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నందున విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో గెలుపు మనదేనని అలక్ష్యం చేయకూడదని, కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనాయకులు, ఎంపీ టికెట్ ఆశించి భంగపడినవారిలో ఎలాంటి అభిప్రాయాలున్నప్పటికీ వాటిని పక్కకుపెట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎంపీ అభ్యర్థి కావ్యను గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చేపట్టనున్న కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు బాధ్యతల కేటాయింపు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ వెస్ట్, పాలకుర్తి, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజుతోపాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్, బొడ్డు సునీత, వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ నమ్మిండ్ల శ్రీనివాస్, డాక్టర్‌ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News