CM Revanth Reddy । పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ 5వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మా నిర్ణయం తీసుకుందన్నారు. విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని మేం భావించామని, అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామని తెలిపారు.
10 ఏళ్లలో 22లక్షల కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పు చేశాడు కానీ, ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులకు 10వేల కోట్లు ఖర్చు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1972 పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారని, ఆయన దార్శనీక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు విద్యను అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు కానీ మేం చేస్తుంటే తప్పుపడుతున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉందని, ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదన్నారు. అయితే కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నించారు. ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో… ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శిస్తున్నారన్నారు.
కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా? అని రేవంత్ ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే 90రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించామన్నారు. కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగొంచడమే మా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలనేది కేసీఆర్ విధానం అని విమర్శించారు. ఏం? మీ పిల్లలు రాజ్యాలు ఏలాలి కానీ… పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించినన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ కు గుండు సున్నా ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదని రేవంత్ అన్నారు.
వాళ్లకు జ్ఞానోదయం కాకపోయినా ఫరవాలేదు… మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ని 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ లో కేసీఆర్ పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని తెలిపారు. 33జిల్లాల్లో ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి కేసీఆర్ పార్టీ భవనాలు కట్టుకుండని ఆరోపించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నయ్ కానీ.. పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన ఆయనకు రాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా ఉంటే వారి మనసుల్లో విషం నిడుతుతుందని, అందుకే కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.