Site icon vidhaatha

lagacharla । రైతుకు బేడీలా? అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం

lagacharla । లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి దవాఖానకు బేడీలు వేసి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీసిన ముఖ్యమంత్రి.. రైతుకు బేడీలు వేసి మరీ తీసుకెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇటువంటి చర్యలను సహించబోదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో పారిశ్రామికకారిడార్ ఏర్పాటుపై ఇటీవల కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లటం, ఆ సమయంలో ఆయనపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు కారకులంటూ బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రధాన నిందితుడిగా సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కలెక్టర్‌పై దాడి చేశారంటూ పలువురు రైతులు కూడా అరెస్టయ్యారు. వారిలో ప్రస్తుతం బేడీలు వేసి, సంగారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లిన హీర్యా నాయక్‌ కూడా ఉన్నారు. కంది సెంట్రల్‌ జైల్లో ఉన్న హీర్యానాయక్‌ బుధవారం రాత్రి అనారోగ్యానికి గురవడంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గురువారం మరోసారి వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు బేడీలతో అతను కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version