Site icon vidhaatha

మనువాదమే బీజేపీ ల‌క్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

బీసీ కులగణన చారిత్రక అవసరం
బీసీ జనగణన చారిత్రక అవసరమ‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జనాభాను లెక్కిస్తేనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వీలుంటుందన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే కాదు.. లెఫ్ట్ భావజాలం అని చెప్పుకునే ఈటల కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదని ప్ర‌శ్నించారు. అమెరికా నుంచి అమలాపురం వరకు.. చంద్ర మండలం నుంచి చింతమడక వరకు కేసీఆర్ అన్నీ మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. గతంలోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారని గుర్తు చేశారు. బీజేపీ విధానంతోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాల‌న్నారా అని సీఎం ప్రశ్నించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆరెస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంద రోజుల తమ ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్నావ్ కదా, రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై నీ కార్యాచరణ ఎక్కడుంది? అని నిలదీశారు.

కవిత బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ ఒప్పందం
క‌విత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నార‌ని రేవంత్‌ ఆరోపించారు. మల్కాజ్ గిరిలో బీజేపీ గెలుస్తుందని మేడ్చల్ బీఆరెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఇందుకు నిదర్శనమ‌న్నారు. నిజంగా బీజేపీతో వైరం ఉంటే వెంట‌నే మ‌ల్లారెడ్డిని స‌స్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీని మెప్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.

రిజర్వేషన్ల రద్దుపై ఈటల మాటేంటి?
ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడలేదని, కేసీఆర్, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఈటల కూడా మాట్లాడటం లేదని రేవంత్‌ అన్నారు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ అమ్మినప్పుడు రాజేందర్‌కు భూములు గుర్తు రాలేదా? అని ప్ర‌శ్నించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా మాట ఇస్తున్నా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతానని చెప్పారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు. కేటీఆర్ చిన్న పిల్లాడని, కేసీఆర్ ఏమైనా విమర్శలు చేస్తే తాను స్పందిస్తానని చెప్పారు. బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ జరుగుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నివేదిక పూర్తిగా వచ్చే వరకు తాను స్పందించనని అన్నారు. 7 లక్షల అప్పుతో మేం ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని, దుబారా ఖర్చులు పూర్తిగా ఆపేశామని తెలిపారు. రుణమాఫీ ఎలా చేయాలో స్ట్రాటజీ తన దగ్గర ఉందని చెప్పారు.

Exit mobile version