విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాష్ట్రంలో పదేళ్ల బీఆరెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లాకు చెందిన తిప్పర్తి జడ్పీటీసీ, గుత్తా ప్రధాన అనుచరుడు పాశం రాంరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, రైతుబంధు మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హైదరాబాదులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. ‘పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్న. నాకు మద్దతు ఇవ్వండి. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా. నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం’ అని హామీ ఇచ్చారు. 2018 లో నల్గొండ ఎమ్మెల్యే గా ఓడిపోయినా, భువనగిరి ఎంపీ గా గెలిపించారని, నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. వేనేపల్లి చందర్ రావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన రెండు నెలలకే వేనేపల్లిని అనరాని మాటలు అన్నారన్నారు. ముప్పై రోజులు మీరు కష్టపడండి.. ఐదేళ్లు మీకోసం నేను కష్టపడతా అన్నారు.
15 నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా బుధవారం రాత్రి వరకు అభ్యర్థుల కసరత్తు పూర్తి అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం రెండో జాబితా వస్తుందన్నారు. 1-15 నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంటుందన్నారు. 70 నుండి 80 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. సీపీఐ, సీపీఎం పొత్తుల చర్చలు నడుస్తున్నాయని, మిర్యాలగూడ మాకు బలమైన సీటు…పొత్తులు ఉంటాయా లేవా అనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు. నల్గొండలో 50 వేల మెజారిటీతో గెలుస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం కట్టే సమయంలోనే నాణ్యత లేదని చెప్పినం. మెడిగడ్డ.. సుందిళ్ల బ్యారేజీల మీద కూడా మాకు అనుమానం ఉంది. డ్యామ్ ల తాజా దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గతంలో మోటార్లు ఖాళీ పోయాయని, కాంట్రాక్టర్ మరమ్మతులు చేయాల్సి ఉండగా, సర్కార్ రూ.150 కోట్లు పెట్టి మరమ్మతులు చేయించడం ఏంటని నిలదీశారు. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటిపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, చిలుక శ్రీనివాస్ రెడ్డి, ఉయ్యాల నాగరాజు, నులపరాజు శ్రీనివాస్, మెరుగు వెంకన్న, ఎండీ బాబర్, వంశీ, సర్పంచులు రొట్టెల రమేష్, ప్రవీణ్ కుమార్,వెంకట్రామిరెడ్డి, మర్రి యాదయ్య, హసన్ బీ, సుశీల, శ్రీదేవి, సతీష్, తునేం రవి, ఎంపీటీసీ సిరివెన్నెల, మాజీ సర్పంచ్ లు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.