కాంగ్రెస్.. చచ్చిన పాముతో సమానం: KTR

  •  మొండి చేయికి ఓటేస్తే
  • ప్రజల బతుకులు ఆగం
  • వ్యారెంటీలే లేని కాంగ్రెస్
  • గ్యారెంటీలు ఎలా ఇస్తుంది?
  • దిక్కుమాలిన పార్టీకి ఓటేస్తే
  • మళ్లీ మంచినీళ్ల యుద్ధాలు.. కరెంటు కష్టాలు
  • గంభీర్ రావు పేటలో మంత్రి కేటీఆర్

విధాత బ్యూరో, కరీంనగర్: కాంగ్రెస్ చచ్చిన పాముతో సమానమని, దిక్కుమాలిన ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ మంచినీళ్ల యుద్ధాలు, కరెంటు కష్టాలు తప్పవని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి, లింగన్నపేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ గ్యారెంటీలు ఇస్తానంటే నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వ్యారెంటీలే లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఎరువులు, విత్తనాల కోసం తిరిగి క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.


అధికారంలోకి వస్తే ఏడాదికో ముఖ్యమంత్రి మారడం ఖాయం అన్నారు. ప్రజలను గందరగోళం చేయడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, పొరపాటున మొండి చేయికి ఓటేస్తే ప్రజల బతుకులు ఆగం అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల నుండి డబ్బు తెచ్చి ఇక్కడ ఖర్చు చేయడం ద్వారా గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు డబ్బు తీసుకొని, కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. ఎన్నికల్లో డబ్బు, మందు పంచనని గతంలోనే తాను చెప్పానని, అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం


కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల, కోళ్ళమద్ది, లింగన్నపేట గంభీరావుపేటలకు సంబంధించిన డబుల్ బెడ్రూం ఇళ్లను, లబ్ధిదారులకు పట్టాలు బుధవారం మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించుకున్నాం. సిరిసిల్లకు రావడం తక్కువ అయ్యింది. ఎవరూ తిట్టుకోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. మానేరులో నిల్వ చేసుకున్నాం. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప ఆలోచనలు చేశారు. రైతుల ఖాతాలో 73వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత కేసీఆర్ ది.


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమం లో బోధన అందిస్తున్నాం’ అని అన్నారు. నర్మాల డ్యాం 365 రోజులు నిండు కుండలా ఉంటుందన్నారు. నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెనలను నిర్మిస్తామన్నారు. గతంలో మున్సిపాలిటీ గా ఉన్న గంభీరావుపేట పేట ను తిరిగి మున్సిపాలిటీగా చేస్తామన్నారు. గంభీరావుపేట పేట పాత జీపి వద్ద రూ.3 కొట్లతో అధునాతన మార్కెట్ ను నిర్మిస్తామన్నారు రూ.3 కోట్లతో లక్ష్మి పూర్ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు.


జిల్లావ్యాప్తంగా 465 గుడిసెలు, 432 రేకుల షెడ్లు, 907 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. మొత్తం 1,967. వీరందరికీ గృహ లక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.