టార్గెట్ బీఆరెస్‌, బీజేపీ: కాంగ్రెస్ పార్టీలో కద‌నోత్సాహం

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన విజయభేరి యాత్ర పార్టీలో నూతనోత్తేజాన్ని నింపింది

– రాహుల్ పర్యటనతో ఉత్తేజం

– జనం నుంచి సానుకూల స్పందన

– ముఖ్య నేతలంతా ఐక్యతా రాగం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు, రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి యాత్ర ఆ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపింది. పనిలో పనిగా బీజేపీ పైన కూడా కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధం ఉందనే అంశం ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ యాత్రకు ఆ పార్టీ యువనేత రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావడంతో నాయకులు, కేడర్ కథనోత్సాహంతో కదులుతున్నారు. అయితే ఇప్పటివరకు సాగిన యాత్ర ప్రాంతాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినవి కావడం గమనార్హం. ములుగు, మంథనిలో సిటింగ్ ఎమ్మెల్యేలు ఉండగా భూపాల్ పల్లిలో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ అనుకూల నియోజకవర్గాలుగా ప్రస్తుత ప్రాంతాన్ని చెప్పవచ్చు.

విజయభేరితో కాంగ్రెస్ లో ఉత్తేజం

గత రెండు రోజులుగా రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపెల్లి, రామగుండం ప్రాంతాలలో చేపట్టిన విజయభేరి సభలు, బస్సుయాత్ర, రాహుల్, ప్రియాంక భాగస్వామ్యం కేడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఏఐసీసీ ప్రధాన నేతలు రావడంతో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్రంలోని ముఖ్య నేతలు అంతా రాహుల్, ప్రియాంక చుట్టూ చేరారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాధుయాష్కి ఇతర ప్రధాన నేతలంతా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతానికి ఐక్యత రాగాన్ని ఆలపిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికలను ఎదుర్కొంటే రానున్న రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయనే విశ్వాసం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసంతో చేపట్టిన విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచార శంఖారావం బస్సు యాత్ర ప్రజల్లో సానుకూల సంకేతాలను నింపింది.

ములుగు నుంచి ప్రారంభించి..

ములుగు వేదికగా చేపట్టిన విజయభేరి బహిరంగ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టడమే కాకుండా రాహుల్, ప్రియాంకల ఉపన్యాసాలకు సానుకూల స్పందన వ్యక్తం అయింది. ప్రజలకు వారు చేసిన విన్నపం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని హామీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాజకీయ ప్రయోజనాలను పట్టించుకోలేదని అంశం, ఆరు గ్యారంటీలు, గత రెండు టర్ములుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశాలుగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ రాబోతుందని రాహుల్ గాంధీ ఆత్మవిశ్వాస ప్రకటన ఆ పార్టీలో మనోస్థైర్యాన్ని నింపుతోంది.

బీఆర్ఎస్ హామీల వైఫల్యంపై విమర్శ

బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని రాహుల్ ఎండగట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దళిత, గిరిజన వర్గాలకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు భృతి, ఖాళీ పోస్టుల భర్తీ పట్ల నిర్లక్ష్యం, ధరణి పోర్టల్, కుల గణన తదితర అంశాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న అక్రమాలపై విమర్శలు ఎక్కువ పెట్టారు. బీజేపీ అనుసరిస్తున్న కుల గణన వ్యతిరేక విధానాలను విమర్శిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అంశాన్ని నొక్కి చెబుతున్నారు. అదే సమయంలో ఎంఐఎం కూడా ఈ రెండు పక్షాలకు మద్దతుగా నిలుస్తుందని ఘాటుగా విమర్శించడం చర్చకు దారితీస్తోంది. తెలంగాణతో తమది రాజకీయ సంబంధం కాదని ఆత్మీయ, ప్రేమ సంబంధం అంటూ తమ నానమ్మ ఇందిరాగాంధీ నుంచి ఇది కొనసాగుతుందంటూ సెంటిమెంట్ మాటలు కూడా ఆకర్షిస్తున్నాయి.

ఆరు గ్యారెంటీలపై భరోసా

ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులకు ఇస్తున్న భరోసా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికంటే బీఆర్ఎస్ అదనంగా ఇస్తామని చెబుతున్నప్పటికీ, ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించడం సానుకూల అంశంగా మారింది. ములుగు సభకు భారీగా జనం రావడం, భూపాలపల్లిలో నిరుద్యోగులు, కార్మికుల ర్యాలీ విజయవంతం, రాహుల్ గాంధీ కార్నర్ మీటింగులు విజయవంతం కావడం మొత్తంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఏ మేరకు సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటుందనేదే ప్రధాన అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం విజయభేరి సాగిన నియోజకవర్గం అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించినందున ఆయా అభ్యర్థులకు సానుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుందని ఆసక్తి కూడా నెలకొంది. ఎన్నికల వరకు ఈ ప్రచార స్థాయిని ఏవిధంగా నిలబెట్టుకుంటారనేది కూడా కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగానే చెప్పవచ్చు. క్షేత్రస్థాయికి ఈ ప్రభావాన్ని చేర్చడం స్థానిక నేతల మీద ఆధారపడి ఉంటుంది.