కేసీఆర్ ఆక్రమంగా సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో వెదజల్లి గెలవాలని అనుకుంటున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలువదన్నారు. నరేంద్ర మోడీ వంద సార్లు వచ్చినా ఆ పార్టీ అభ్యర్థులు గెలువరని చెప్పారు. మోడీ కర్ణాటకలో 40 సార్లు ఎన్నికల ప్రచారం చేసినా ఓడిపోయారని గుర్తు చేశారు. మోదీ చెప్పినన్ని అబద్ధాలు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ వినలేదని స్పష్టం చేశారు.
మోడీ ప్రధాని అయ్యాక ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని చెప్పారు. దళితులకు, బీసీలకు, పేదలకు నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెడితే… బీజేపీ వ్యతిరేకించిందని చెప్పారు. అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో చెప్పిన 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో తమ గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో కర్ణాటకకు వస్తే తెలుస్తుందన్నారు. మోదీ, కేసీఆర్ అబద్ధాలను నమ్మొద్దన్నారు. బీజేపీకి బీఆరెస్ బీ టీమ్ అని ఆరోపించారు.