BRSలోకి కాంగ్రెస్ నేత బిల్యా నాయనాయ‌క్..కండువ‌ కప్పిన మంత్రి కేటీఆర్

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత కేతావత్ బిల్యా నాయక్ తన అనుచరులతో కలిసి హైదరాబాదులో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటీఎంగా వాడుతున్నారని, ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు అంటూ… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదన్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారని, 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతారా అని ప్రశ్నించారు. ఒక్క దేవరకొండలోనే రూ.600 కోట్లతో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయన్న ఆయన ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి రానున్న ప్రభుత్వంలో దేవరకొండ ప్రజలకు సాగునీరు అందించి వారి రుణం తీర్చుకుంటామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బిల్యా నాయక్ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.