విధాత : సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తుపాకి రాముడి మాటలు చేప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి లక్ష కోట్ల ఆక్రమ ఆస్తులు కూడబెట్టుకుని, రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. పాలేరులో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పాలేరు ఒక్కసారి గెలిపించి పార్టీ మారిన వ్యక్తిని మళ్లీ గెలిపించి మన మీద కక్ష తీర్చుకోమని చెబుదామా అంటూ కందళా ఉపేందర్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పాలేరు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణా రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి అను బంధం ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు. సొల్లు మాటలు చెప్పే కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే ప్రజలు పరిమితం చేయాలన్నారు. యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇంత వరకు ఇవ్వకపోవడంతోనే ఇక్కడి ఎమ్మెల్యే కందాళ అద్వాన్న పనితీరుకు నిదర్శమన్నారు.
ఎన్నికల్లో బీఆరెస్ నేతలు డబ్బు సంచులతో వస్తారని, ఎంత అడిగితే అంత ఇస్తారన్నారు. మనం కట్టిన పన్నుల డబ్బులను అడ్డగోలుగా దోచుకుని అదే డబ్బులతో ప్రజల దగ్గరకే బీఆరెస్ నేతలు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలుతో అన్ని వర్గాల పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందన్నారు.