విధాత : సీఎం కేసీఆర్ అపద్దర్మ ప్రభుత్వం అక్రమ చర్యలను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల్లో బీఆరెస్ ఓటమిని గ్రహించిన నేపధ్యంలో సీఎం కేసీఆర్ రైతుబంధు నిధులు 6వేల కోట్లను కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు ఆదేశాలిచ్చారని ఫిర్యాదులో పేర్కోన్నారు. వాటి నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అలాగే ధరణి ద్వారా అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వారికి కట్టబేట్టేలా రికార్డులు తారుమారు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు.
వెంటనే కేసీఆర్ అక్రమాలపై ఎన్నికల సంఘం స్పందించాలని, గత రెండు మూడు రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని, ప్రభుత్వ తాజా లావాదేవిలపై నిఘా పెట్టాలని కాంగ్రెస్ బృందం కోరింది. సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, హర్కర వేణుగోపాల్, నిరంజన్, రోహిణ్ రెడ్డి, అనిల్ యాదవ్, తదితరులు ఉన్నారు.