విధాత, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఆదివారం 58 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో రాష్ట్ర నాయకులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులో భాగంగా వదులుకోవాల్సిన సీట్ల విషయంపై ఖమ్మం జిల్లా నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితర నేతలతో మురళీధరన్ సుదీర్ఘంగా చర్చించారు.
దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారని, తెలంగాణలో కూడా వారితో పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి, ఒప్పించినట్టు తెలిసింది. అనంతరం మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయే 58 మంది పేర్లతో తొలి జాబితాను ఆదివారం ప్రకటిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందన్నారు.
మరో రెండురోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ నేతలతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. పొత్తులపై ఆదివారం స్పష్టత వస్తుందన్నారు. గెలుపు అవకాశాలున్నవారిని, పార్టీకి విధేయులుగా ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం తమ అంతర్గత విషయమన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 119 స్థానాల్లో మెజారిటీ పార్టీ నేతలకు సీట్లు ఇస్తామన్నారు.
హైకమాండ్ ఆదేశం మేరకు పోటీ చేస్తా: తుమ్మల
పార్టీ హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఢిల్లీకి వెళ్లిన ఆయన రాహుల్ గాంధీని, మురళీధరన్ లను కలిసి తన శక్తి మేరకు పనిచేస్తామని చెప్పానన్నారు. గతంలో పాలేరు నుంచి పోటీ చేశానన్న తుమ్మల హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. జాతీయ నాయకులతో జిల్లా రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
లెఫ్ట్ నేతలతో పొత్తులపై చర్చిస్తాం : రేవంత్
మురళీధరన్ తో ఈ రోజు జరిగిన మా పార్టీలో తమకు స్పష్టత వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఐ, సీపీఎంతో చర్చల తర్వాత పొత్తులపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఆదివారం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చర్చ తర్వాత పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. రాహుల్, ప్రియాంకల రాష్ట్ర పర్యటన వివరాలు ఆదివారం మధ్యాహ్నానికి వెల్లడిస్తామన్నారు.
విద్యార్థులు రెండు నెలలు ఓపిక పట్టాలి
విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించిన రేవంత్.. రెండు నెలలు ఓపిక పట్టాలని యువతను కోరారు. ఏ ఒక్కరు కూడా భావోద్వానికి గురి కావొద్దని పిలుపుచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్ 9న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నా పత్రాలు అమ్మడం ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. పిల్లల ఆత్మహత్యలు తగ్గాలంటే, రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు. సింగరేణి నియామకాలలో కూడా సరిగ్గా చేయడం లేదన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వల్ల పిల్లలు మనస్థాపనతో ఉన్నారని తెలిపారు.