విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కసరత్తు చివరి దశలో ఉంది. సాధ్యమైనంత ఎక్కువ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేయాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఉంది. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గంలో ఒకటికి పది సార్లు ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తోంది. బీఆరెస్ అభ్యర్థుల కంటే మెరుగైన స్థానంలోఉన్న అభ్యర్థులను బరిలోకి దింపడానికి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇవ్వడానికి చివరి ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్, బీజేపీతో పాటు తటస్థంగా ఉన్న బలమైన నేతలను టచ్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనడానికి నేతలు శుక్రవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు నేతలు శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.