టికెట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్: పద్మా దేవేందర్ రెడ్డి

  • Publish Date - November 3, 2023 / 01:14 PM IST

– వారివి కుర్చీల కోసం కొట్లాడే రాజకీయాలు

– ఆపార్టీని గెలిస్తే కరెంట్ కోతలే

విధాత, మెదక్ బ్యూరో: అభ్యర్థుల టికెట్లు అమ్ముకొనే పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు వస్తాయని.. రైతులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పదవుల కోసం పోట్లాడే ఆపార్టీ ప్రజలకు ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్, ఖాజాపూర్ తండాలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెపుతోందని, ప్రజలను వాటిని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం వంటావార్పు, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సమయంలో ఖాజాపూర్, ఖాజాపూర్ తండా ముందు వరుసలో ఉన్నాయన్నారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగా తండాల అభివృద్ధి కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, వాటికి భవనాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుకు రూ.15000 ఇస్తమంటే, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎకరానికి రూ.16,000లు ఇస్తుందని అన్నారు. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే రూ.2000 పెన్షన్ లో రూ.1100 గ్యాస్ సిలిండర్ కి పోతున్నాయని ఆలోచించి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.400లకు ఇవ్వనున్నట్లు తెలిపారు.


రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటున్నాడు, ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు నిలిపి వేయాలని అంటున్నాడు.. దీనివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. డ్వాక్రా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆరెస్ ను గెలిపించాలని కోరారు.