కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ

  • Publish Date - November 13, 2023 / 05:12 PM IST

నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత 

జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జానారెడ్డి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. నాగార్జున సాగర్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీటిలో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 21 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లలో మాజీ సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి నామినేషన్ కూడా ఉండడం గమనార్హం.

జానారెడ్డి ఫామ్ ఏ, బీ ఫారాలను కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఒక సెట్ మాత్రమే సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థిగా జయవీర్ రెడ్డి నామినేషన్ ఆమోదించినందున జానారెడ్డి నామినేషన్ అధికారులు తిరస్కరించారు. వివిధ కారణాలతో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి పులిమల్ల కృష్ణారావు, విద్యావంతుల పార్టీకి చెందిన చిలుముల గోపి, జన శంఖారావం అభ్యర్థి కనుకుంట్ల అనిల్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు కామల్ల జనార్ధన్, బాలు నాయక్ ఈసం నాగార్జున నామినేషన్లను తిరస్కరించారు.

కాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కంకణాల నివేదిత, కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల భగత్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి లోకబోయిన వెంకటరమణ, యువ తులసి పార్టీ అభ్యర్థి నకిరేకంటి అన్నపూర్ణ, సీపీఎం అభ్యర్థి పోతుగంటి కాశయ్య, సీపీఐ జక్కుల నరసింహ, ధర్మ సమాజ అభ్యర్థి మామిడి సైదయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థులు గవ్వలపల్లి సుబ్రహ్మణ్యం, జీ సుబ్రహ్మణ్యం, గాదే సైదయ్య, చిట్టిపోలు వీరయ్య, దేవుళ్ళ సుబ్బారావు, పానుగోతు లాల్ సింగ్, వనం విజయ్ కుమార్, ఊట విజయ్ కుమార్ సైదులు, చిట్టిమల్ల నాగార్జున నామినేషన్లు ఆమోదం పొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే శ్రీనివాస్ తెలిపారు.