విధాత: ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాబోయే వందరోజుల్లో అంచెలంచెలుగా అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తొలి సమావేశం నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణాల కోసం శనివారం అసెంబ్లీని సమావేశపరచాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్రివర్గం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన సమావేశం నిర్ణయాలు, వివరాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పొన్నం ప్రభాకర్‌తో మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ పార్టీకి అధికారం అప్పగించిన యావత్ తెలంగాణ ప్రజలందరికీ సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రివర్గ సహచరులంతా కేబినెట్ సమావేశం ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌ను గెలిపించారని, వారు ఆశించిన విధంగా పాలిస్తూ, మార్పు సాధన దిశగా ముందడుగు వేస్తామన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారెంటీల అమలు, అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల సమీకరణపై చర్చ జరిగిందన్నారు. ఆరు గ్యారంటీలలో ముందుగా సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రెండు రెండు గ్యారెంటీలైన మహిళలకు ఉచి బస్ ప్రయాణ వసతి, రాజీ్వ్ ఆరోగ్య శ్రీ బీమా పరిమితి 10లక్షలకు పెంపును ప్రారంభించబోతున్నామన్నారు.
ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం 2014- 2023 డిసెంబర్ 7వరకు అన్ని శాఖల ద్వారా ఎంత ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు చేశారు? వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంతవరకు చేరువయ్యాయి? అన్నదానిపై చర్చించాలని నిర్ణయించామన్నారు. వెంటనే అన్ని శాఖల అధికారులు ఆదాయ వ్యయాల వివరాలను అందించాలని ఆదేశించామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ప్రజలందరికీ తెలిసే విధంగా పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించామని దుద్దిళ్ల చెప్పారు. మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇంకా శాఖల కేటాయింపు జరుగలేదని తెలిపారు.
విద్యుత్తు శాఖపై నేడు సమీక్ష
2014 నుంచి ఇప్పటి దాకా విద్యుత్తు అంశంపై గత ప్రభుత్వం ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయాలను, తప్పులను సమీక్షించాలని నిర్ణయించామని శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్తు పరిస్థితులపై సమీక్ష చేస్తారని వెల్లడించారు. తమ ఆరు గ్యారంటీలలో ఒకటైన 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తును తదుపరి దశలో అమలు చేస్తామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు.
9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 9వ తేదీన శాసన సభను సమావేశపరుస్తున్నట్టు మంత్రి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ద్వారా ప్రమాణ చేయించడం ఉంటుందని చెప్పారు. రైతు భరోసా పెట్టుబడి సాయంపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను కోరామని, వీలైనంత త్వరగా సంబంధిత సహాయాన్ని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకే ముందుగా ఆర్థిక పరిస్థితులు, వనరుల సేకరణపై సంపూర్ణ సమాచారం సేకరించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షల అంశంపై కూడా చర్చించామని, మునుముందు వాటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం జ్యోతిబాఫూలే భవన్‌లో తొలి ప్రజాదర్బార్ నిర్వహించనున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.