ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కే మొగ్గు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గినట్లు పోలింగ్ సరళిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ గత ఎన్నికల్లో విజయమే

  • Publish Date - November 30, 2023 / 01:25 PM IST

– బీఆర్ఎస్ కు ఎదురుగాలి

– పుంజుకున్న బీజేపీ

– పోలింగ్ సరళిపై విస్తృత చర్చ

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గినట్లు పోలింగ్ సరళిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ గత ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగినా, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018లో విజయకేతనం ఎగరవేసిన స్థానాల్లో సైతం గట్టి పోటీ ఇవ్వలేక పోయిందని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్ మూడో స్థానంలోకి వెళుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసిఫాబాద్ నియోజకవర్గం మినహా 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అలాంటి నేపథ్యం నుండి ఈ ఐదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి ఆదరణ కరువవుతోందని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక్క స్థానం నుండి 6 స్థానాలు గెలవబోతున్నదని, పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఆపార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు.

సిర్పూర్: సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు, బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మధ్య పోటా పోటీగా ఓటింగ్ కొనసాగింది. ఈరెండు పార్టీల్లో బీజేపీ కొంత మేర అధిక ఓట్లు సాధిస్తుందని చెబుతున్నారు. రెండో స్థానంలో బీఎస్పీ, మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఉండే అవకాశాలున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుకు విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోరు కొనసాగింది. అధికార పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు 171 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి బరిలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యామ్ నాయక్ మధ్య పోటాపోటీ పోరు కొనసాగింది. ఎవరు గెలిచినా 1000-2000 ఓట్ల లోపు తేడాతో గెలిచే అవకాశాలున్నాయని ఓటింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. స్వల్ప మెజార్టీతో శ్యాం నాయక్ బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నిలిచిన ప్రధాన పార్టీల పాత అభ్యర్థులే ప్రస్తుతం కూడా బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే దివాకర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రేమ సాగర రావు, బీజేపీ అభ్యర్థిగా ఎర్రవెల్లి రఘునాథ్ ముగ్గురూ హేమాహేమీగా ఈఎన్నికల్లో తలపడ్డారు. ఇందులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఓటింగ్ సరళి బట్టి అంచనా వేస్తున్నారు. మూడో స్థానంలో దివాకర్ రావు ఉండే అవకాశాలు ఉన్నాయని చర్చ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కే ఎట్టకేలకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణలు భావిస్తున్నారు.

చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా కొనసాగింది. అధికార పార్టీకి చెందిన బాల్క సుమన్ పోటీలో ఉండగా, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ వెంకటస్వామి పోటీలో ఉన్నారు. వారం రోజుల నుండి వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడని ప్రచారం సాగింది. నువ్వా నేనా అనే విధంగా పోరు సాగిన నేపథ్యంలో కొంత కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పోటీలో ఉన్నారు. ప్రత్యర్థి గడ్డం వినోద్ గతంలో బీఎస్పీ పార్టీ తరపున నిలబడి 43 శాతం ఓట్లు సాధించి, అధికార పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు. తాజా ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరూ ముఖాముఖి తలపడుతున్నప్పటికీ, గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో దిగి అధికార పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యతో తలపడ్డాడు. బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపుగా గడ్డం వినోద్ సునాయాసంగా గెలుస్తున్నాడని తెలుస్తోంది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అధికార పార్టీకి చెందిన జోగు రామన్న, బీజేపీ నుంచి పాయల శంకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుజాత స్థానంలో తాజా ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. త్రిముఖ పోటీ స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య స్పష్టమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచే అవకాశాలున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి పాయల శంకర్, మూడో స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి జోగు రామన్న ఉంటాడని పరిశీలకులు భావిస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.

బోథ్: బోథ్ నియోజవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ బాబురావు, కాంగ్రెస్ పార్టీ నుండి సోయం బాబురావు పోటాపోటీ పోరులో, 2023 మెజార్టీతో అధికార పార్టీ నాయకుడు రాథోడ్ బాబురావు గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చి అతని స్థానంలో గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అనిల్ జాదవ్ కు

టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న సోయం బాబురావు ప్రస్తుతం బీజేపీ తరపున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడే గజేందర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థి సోయం బాబురావు మధ్య పోటాపోటీ ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాల్ని, అధికార పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ ఎడ్జ్ లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున కూచిపూడి శ్రీహరి రావు పోటీలో ఉన్నారు. పోలింగ్ సరళిని చూస్తే, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి గెలిచే అవకాశాన్ని స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్తుందని చెబుతున్నారు.

ఖానాపూర్: అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుండి వెడమ బొజ్జు, బీజేపీ నుండి రాథోడ్ రమేష్ పోటీలో నిలిచారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో పోరు కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి వెడమ బొజ్జు గెలిచే అవకాశాలున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ముధోల్: ముధోల్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, బీజేపీ నుండి రామారావు పటేల్, కాంగ్రెస్ నుండి నారాయణరావు పటేల్ పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మూడో స్థానంలో అధికార పార్టీ విట్టల్ రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.