Jagga Reddy | మంత్రులంతా జట్టుగానే పనిచేస్తున్నారు: జగ్గారెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా పనిచేస్తున్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

  • Publish Date - May 23, 2024 / 04:18 PM IST

రాజకీయ లక్ష్యాలతోనే బీఆరెస్‌, బీజేపీల విమర్శలు
ఏలేటి అవాస్తవాల ప్రచారం మానుకో
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి

విధాత, హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా పనిచేస్తున్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. రాజకీయ లక్ష్యాలతో బీఆరెస్‌, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తు బురదచల్లె ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సీఎం, మంత్రులపైన అవాస్తవాలతో కూడిన విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రోజుకో ట్యాక్స్ పేరుతో సీఎంపైన, మంత్రులపై మహేశ్వర్ రెడ్డి మీడియాలో దుష్ర్పచారం చేయడం కాకుండా తన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే వాటిని మీడియాకు అప్పగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఇకనైనా మహేశ్వర్ రెడ్డి ఇటువంటి అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని, మాట్లాడే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు. మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం, భట్టి, ఉత్తమ్‌లు తెల్లని కాగితం వంటి వారని, అనవసరంగా ఎందుకు ఇంకు చల్లుతారని ప్రశ్నించారు. బట్ట కాల్చి ఉత్తమ్ మీద వేయడం కరెక్ట్ కాదని మహేశ్వర రెడ్డికి సూచించారు. ఉత్తమ్‌ను ఇబ్బంది పెట్టడంలో మహేశ్వర రెడ్డికి ఒనగూరే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు. గుర్తింపు కోసమే ఉత్తమ్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ ఆచితూచి పని చేసుకుంటూ పోయే వ్యక్తి అని, ఆయన ఎవరి ట్రాప్ లోనూ పడే వ్యక్తి కాదన్నారు. కావాలనే ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఉందని ధ్వజమెత్తారు. ఉత్తమ్ నిజంగానే తప్పు చేసి ఉంటే ఈ పాటికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేవన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేశారు.

Latest News