పకడ్బందీగా ఎన్నికల కోడ్.. ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు

విధాత, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సిబ్బందికి ఎలక్షన్ విధులపై దిశానిర్దేశం చెయ్యటానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సకాలంలో నివేదికల తయారీ, పర్యవేక్షణ, పోలీసు బలగాల సమగ్ర శిక్షణ, బ్రీఫింగ్ ను ఎన్నికలు ముగిసే వరకు కీలక అంశాలుగా ఉద్ఘాటించారు. ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలూ పని చేసే ప్రత్యేక సెల్‌లను యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రలోభాలకు సంబంధించిన ఏవైనా సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీల రూట్ ప్లానింగ్, టైమింగ్, పర్మిషన్ల జారీతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. లైసెన్స్ పొందిన తుపాకీలన్నీ తప్పనిసరిగా అప్పగించాలని, ఎన్నికలు ముగిసే వరకు కొత్త లైసెన్స్‌లు జారీ చేయకూడదని తెలిపారు. స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్‌ఎస్‌టి), ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు పేర్కొన్నారు.

నాన్-బెయిలబుల్ వారెంట్‌ల అమలు, సోషల్ మీడియా పర్యవేక్షణ, హవాలా ఆపరేటర్లపై నిఘా, సమస్యాత్మక వ్యక్తులపై బైండింగ్ ఓవర్ పై సమావేశంలో చర్చించారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా& ఆర్డర్) విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ ఈసీఐ ముందుగా నిర్ణయించిన సమయ పరిమితుల్లో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉద్ఘాటించారు. అదనపు పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ నగదు, విలువైన లోహాలు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకునేటప్పుడు విధానాలను ఏకరీతిగా వర్తింపజేయాలని సూచించారు. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లపై నిఘా ఉంచడం, ఎన్నికల నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం, పోలీసు బలగాలకు స్పష్టమైన సూచనలు అందించడం వంటి ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్ బాబు, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు.