విధాత, హైదరాబాద్ : విద్యార్ధుల స్థానికతకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.33 స్థానికులకు నష్టం చేస్తుందని, ఈ జీవో తక్షణం ఉపసంహరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 33 ప్రకారం తెలంగాణ బిడ్డలనే స్థానికేతరులుగా పరిగణించే ప్రమాదం ఉన్నదన్నారు. స్థానికతకు సంబంధించిన ఆదేశాలు స్థానికుల హక్కులు పరిరక్షించేవిగా ఉండాలి తప్ప స్థానికులకే నష్టం చేయకూడదన్నారు. జీవో నెం.33 ఫలితంగా స్థానికులు నష్టపోతున్నారని, ప్రస్తుతం వైద్య విద్యకు పరిమితం చేసినా తర్వాత కాలంలో అన్ని రంగాలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలులోకి వచ్చిన జీవో నెం 114లో పొందుపరిచిన నిబంధనలను పునరుద్ధరిస్తూ తక్షణం ఆదేశాలు జారీ చేయాలని, వైద్య రంగంతో పాటు అన్ని రంగాలకూ అది వర్తించేవిధంగా ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదని తమ్మినేని స్పష్టం చేశారు.