బీఆరెస్ ను ఓడించండి: సీపీఎం నేత పోతినేని సుదర్శన్ రావు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు.

– ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం

– రెండోరోజూ కొనసాగిన పార్టీ శిక్షణా తరగతులు

విధాత, సూర్యాపేట: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాస్థాయి పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు బుధవారం రెండోరోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించేది కమ్యూనిస్టులేనని అన్నారు. ఎ

న్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మరోవైపు ఎన్నికలు రావడంతో కొత్త హామీలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలిసిన పార్టీ కార్యకర్తలు బీఆరెస్ కు గుడ్ బై చెప్పి, ఇతర పార్టీల్లో చేరడం శుభ పరిణామమన్నారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పదేళ్లయినా నేటికీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు పీ సోమయ్య, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.