– రేపు భద్రకాళి వద్ద ప్రమాణం చేద్దాం
– ఎమ్మెల్యే వినయ్‌కు సవాల్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. రేపు ఎనిమిది గంటలకు భద్రకాళి దేవాలయం వద్దకు కుటుంబ సభ్యులతో వస్తా. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలంటూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు.
హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిసారి అవకాశం వస్తుందంటే నిజస్వరూపాలు బయటపడుతున్నాయన్నారు. రాజకీయాల మీద విరక్తి చెందేలా కుట్రలు చేస్తున్నారన్నారు. రాజేందర్ రెడ్డి అమ్ముడు పోతాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకున్నట్లు, ఇతర పార్టీలకు అమ్ముడుపోయానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
దాంట్లో కొంతమంది దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ అమ్ముడు పోతాడంటూ సెల్ ఫోన్ లో మా వాళ్లే కొంతమంది సందేశాలు పంపిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ గేట్ ఎదుట చెప్పులదండ కట్టి కూర్చుంటాను, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులతో చర్చించి ఎవరు కబ్జా చేశారో అక్కడే తేల్చుకుందామన్నారు. గత ఎన్నికల్లో రేవూరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చుల కోసం కొంత ఇచ్చారని చెప్పారు. రాఘవరెడ్డి 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, రెండు చేతులు జోడించి అడిగా, నాకు సహకరించమన్నాను.
ఆయన ఎవరికి టికెట్ వచ్చిన గెలిపించుకుంటామని చెప్పారని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టీపీసీసీ ఎస్సీ విభాగం కో ఆర్డినేటర్ ఎంపీ ఆనంద్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్, జిల్లా ఐఎన్టీయూసీ చైర్మన్ కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్సీ విభాగం డాక్టర్ పీ రామకృష్ణ, జిల్లా ఓబీసీ విభాగం చైర్మన్ బొమ్మతి విక్రమ్ పాల్గొన్నారు.