విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అహంకారపూరిత అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ అభ్యర్థి పిల్లి రామరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సేవ చేయడానికి మీలో ఒక్కడిగా, మీ ఇంటి సభ్యుడిగా వస్తున్నానని, ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. అనేక అవమానాలను ఎదుర్కొని బహుజన వర్గాల పక్షాన నిలబడ్డానన్నారు.
నల్లగొండ నియోజకవర్గంలో ఒకటి, రెండు కులాలు మాత్రమే సేవ పేరుతో ఏళ్ల తరబడి దోచుకొని తింటున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అక్రమ ఆస్తులు కూడ పెట్టుకోవడమే ధ్యేయంగా పోటీ చేస్తున్న ఆధిపత్య వర్గాలకు ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. తనను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటానని, పేద ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బారాసాలకు చెందిన పలువురు నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు.