పాల్వంచ కేటీపీఎస్ 8 కూలింగ్ టవర్ల కూల్చివేత.. నిమిషాల్లో నేలమట్టమైన చారిత్రాత్మక టవర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో ఓ అండ్ ఎం కర్మాగారంలోని కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను భధ్రతా కారణాల నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు కూల్చివేశారు

  • Publish Date - August 5, 2024 / 01:59 PM IST

విధాత, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో ఓ అండ్ ఎం కర్మాగారంలోని కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను భధ్రతా కారణాల నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లిన పాత కూలింగ్ టవర్లతో ఎలాంటి ప్రమాదం జరుకముందే కూల్చివేయాలని, ఆ ప్రాంతాన్ని సద్వినియోం చేసుకోవాలని కేటీపీఎస్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ 11న కర్మాగారం మూతపడింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ట్రాన్స్‌కోతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన అనంతరం కూల్చివేత చేపట్టారు. 30 మంది సిబ్బంది సుమారు నెలరోజుల పాటు కూల్చివేతల పనులు చేపట్టారు. కేటీపీఎస్ లోని బాయిలర్, టర్బైన్లను తొలగించిన తర్వాత ఇంప్లోజన్ పద్దతిలో 20 కేజీల పేలుడు పదార్థాలను అమర్చి కూలింగ్ టవర్లను కుప్ప కూల్చారు. మొత్తం మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. తొలుత ‘ఏ’ స్టేషన్లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన నాలుగు కూలింగ్ టవర్లు కూల్చివేశారు. ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో ఒకేసారి నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్ అనే పేలుడు పదార్థాన్ని దీనికోసం వినియోగించారు. కూల్చిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆ ప్రదేశం కేటీపీఎస్‌ను వినియోగంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 1965-67 మధ్య కాలంలో నిర్మించిన ఈ కూలింగ్ టవర్లు ఆరు దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషించాయి. విద్యుత్తు కర్మాగారంలో బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి అయ్యే వేడిని అదుపు చేసేందుకు ఈ కూలింగ్ టవర్లు సహకరిస్తాయి. 103 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్లు పాల్వంచ పట్టణానికే తలమానికంగా ఉండేవి. దేశంలోనే ఎత్తైన టవర్లుగా చరిత్రలో నిలిచిన ఈ టవర్లను నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో ఎందరో కార్మికులు శ్రమించారు.

నోయిడాలో టవర్లను కూల్చిన సంస్థనే

ఢిల్లీలో నోయిడా టవర్లను కూల్చి వేసిన జైపూర్‌ సంస్థనే కేటీపీఎస్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను ఒకేసారి కూల్చి వేసింది. దేశ చరిత్రలో ఇది అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా కూల్చివేయదలచుకున్న నిర్మాణం వరకే కూల్చివేస్తారు. ఇంప్లోజన్ పద్దతిలో 20 కేజీల ఎక్స్ ప్లోజివ్స్ ను ఉపయోగించి ఈ టవర్లను నేలమట్టం చేశారు. ఆకాశమంత ఎత్తులో పదుల సంవత్సరాలుగా పాల్వంచ పట్టణ ప్రజల కళ్ళకు కనిపించిన టవర్లు కూల్చి వేస్తున్న దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు. పాల్వంచ కేటీపీఎస్ లో 120 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి క్రమంలో 6 దశాబ్దాలుగా సేవలందించిన ఈ టవర్లను కూల్చి వేయడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.