అనర్హత వేటుకై బీఆరెస్ యత్నాలు
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే భారం
అధిష్ఠానం ఆలోచనపై అయోమయం
పాతిక మంది చేరితేనే సేఫ్ జోన్‌లో
ఢిల్లీ పర్యటనతోనైనా స్పష్టత వచ్చేనా?
విధాత : ఎన్నో ఆశలతో అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరిన బీఆరెస్ ఎమ్మెల్యేల మెడపై ఫిరాయింపు కత్తి వేలాడుతుండటంతో వారి శాసన సభ్యత్వాల వ్యవహారం గందరగోళంలో పడింది. బీఆరెస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు చేరితేనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), ఇతర కాంగ్రెస్ నాయకులు 25 మంది వస్తారని చెబుతూ వచ్చినా.. వారి అంచనాలకు భిన్నంగా 10 మంది బీఆరెస్ (BRS) ఎమ్మెల్యేల చేరికతోనే వలసలు ఆగిపోయాయి. గేట్లు తెరిచాం.. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు మాత్రమే బీఆరెస్‌లో ఉంటారని, మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరిపోతారని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులంతా ఊదరగొట్టారు. కానీ.. ఇప్పటికైతే 25 సంఖ్యకు దగ్గరలో కూడా లేరు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiam Srihari), తెల్లం వెంకట్రావు(and Tellam Venkatarao)పై అనర్హత వేటు (disqualification) వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) తో పాటు హైకోర్టును బీఆరెస్ ఆశ్రయించింది. హైకోర్టు (High Court) ఈ కేసు విచారణను తేల్చేదిశగా సాగుతుండటంతో ఫిరాయింపు బీఆరెస్ ఎమ్మెల్యేల్లో అనర్హత గుబులు మొదలైంది. అటు మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో సైతం కేసు దాఖలు చేయాలని బీఆరెస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు తమకు ప్రతికూలంగా వస్తే అనవసరంగా ఉప ఎన్నికలను (by-elections) ఎదుర్కోవాల్సివస్తుందన్న ఆందోళన ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నది. దీనికి తోడు ఉప ఎన్నికలు ఖాయమంటూ కేటీఆర్ (KTR), హరీశ్‌రావు చేస్తున్న ప్రకటనలు సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యేల్లో సైతం కొందరూ అనర్హత భయంతో ఊగిసలాడుతూ త్రిశంకు స్వర్గంలో కొనసాగుతున్నారు. రెండు పార్టీల అధిష్ఠానాలతో టచ్‌లో ఉంటున్నారు. ఇందుకు ఇటీవల అసెంబ్లీ లాబీల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishnamohan Reddy), తెల్లం వెంకట్రావు వైఖరినే నిదర్శనంగా కనిపించింది. తాము 25 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా కాంగ్రెస్‌లోకి వస్తారని భావించామని, పరిస్థితులు అలా కనిపించడం లేదని, అలాంటప్పుడు అనర్హత వేటును ఎదుర్కోక తప్పదన్న ఆందోళన ఫిరాయింపు ఎమ్మెల్యేలను పీడిస్తున్నది.
వలసలు ఆగాయా? కొనసాగుతాయా?
కాంగ్రెస్‌లోకి బీఆరెస్ ఎమ్మెల్యేల వలసలు ఆగినట్లేనా అంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) పాలన సాగుతున్న తీరుపై విశ్లేషణతోనో లేక కేసీఆర్ వలసలకు అడ్డుకట్ట వేయడంలో నిరంతరం సాగిస్తున్న ప్రయత్నాల ఫలితమో లేక కాంగ్రెస్ నుంచి సరైన హామీలు లభించకనో గానీ.. బీఆరెస్ నుంచి కొత్తగా ఎవరూ కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు రావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం అషాఢ మాసం అడ్డురావడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో వలసలకు విరామం పడిందని, ముగింపు కాదని చెబుతున్నారు. త్వరలోనే మరింత మంది బీఆరెస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతాయని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh) తిరిగి ప్రారంభించారని, బీఆరెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులతో పాటు చేరికలకు మొగ్గు చూపని వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను సాగిస్తున్నారన్న ప్రచారం వినిపిస్తున్నది. రాజధాని బీఆరెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వేధింపు పంథా అనుసరిస్తున్నారని చెబుతున్నారు. వేధింపులకు బదులుగా తమ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల నుంచి అడ్డంకులు తొలగిస్తే తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమని ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేల నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్నల్స్ వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే బీఆరెస్ ఎల్పీ చీలికకు కావాల్సిన 25మంది ఎమ్మెల్యేల మార్కు ఫిరాయింపులు సాగాల్సివుంది. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్న వాదన సైతం వినిపిస్తున్నది. ఇప్పటికే బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి రాజకీయంగా సమస్యలు (political problems) ఎదురవుతున్నాయి. ఈ తరహా సమస్యలతో పాటు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడమన్న ఆలోచనతో ఇతర బీఆరెస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం సాగుతున్నది. మరీముఖ్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం బీఆరెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సానుకూలంగా లేదని, వలసల ప్రక్రియ కొనసాగించకుండా సీఎం రేవంత్‌రెడ్డికి బ్రేక్ వేసిందన్న ప్రచారం సైతం ఉన్నది.
సీఎం ఢిల్లీ పర్యటనతో తేలనున్న వలసల లెక్కలు
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో బీఆరెస్ నుంచి వలసలపై స్పష్టత రానుందని సమాచారం. వలసల అంశంతో పాటు నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల కథనం. అటు ఇప్పటికే బీఆరెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల నుంచి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి పెరిగింది. వారిని అనర్హత వేటు ముప్పు నుంచి తప్పించేందుకు మరో 15మంది బీఆరెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రక్రియను సాగించాల్సిన అనివార్యత రేవంత్ రెడ్డిపై పడింది. లేదంటే దానం, కడియం, తెల్లంపై అనర్హత వేటు పడితే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోక తప్పదు. అసలే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో జాప్యం నేపథ్యంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవడం అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయంగా నిలదొక్కుకునే యత్నాల్లో బీఆరెస్
10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ద్వారా ఉప ఎన్నికల పరిస్థితి తెచ్చి రాజకీయంగా తిరిగి బలపడాలనేది బీఆరెస్ వ్యూహంగా కనిపిస్తున్నది. అటు లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన బలంతో బీజేపీ అధిష్ఠానం సైతం పార్టీ విస్తరణ కోణంలో ఉప ఎన్నికల ప్రక్రియకు తమవంతు చేయూతనందించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మరో 15మంది బీఆరెస్ ఎమ్మెల్యేలను నయానో భయానో చేర్చుకోవడం కాంగ్రెస్‌కు శరణ్యంగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.