విధాత : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతితో రగిలిపోతున్నారు. బీజేపీ మూడో జాబితాపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ టికెట్ ఆశించిన మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి , అంబర్‌పేట్, ముషిరాబాద్ టికెట్ ఆశించిన ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి మూడో జాబితాలో టికెట్ వస్తుందని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినప్పటికి టికెట్ దక్కలేదు. ఆందోల్ టికెట్ ఆశించిన బాబుమోహన్‌కు మూడో జాబితాలో చోటు దక్కడంతో ఈ టికెట్‌పై ఆశ పెట్టుకున్న ఆయన కుమారుడు ఉదయ్, మెదక్ జడ్పీ చైర్మన్ మాసన్నగారి బాలయ్యలకు నిరాశే ఎదురైంది. మహిళా మోర్చాలో ఒక్కరికి కూడా టికెట్ దక్కకపోవడం మహిలా నేతలను అసంతృప్తికి గురి చేసింది.
జూబ్లీహిల్స్ నుంచి డాక్టర్ విరేపనేని పద్మ, సనత్‌నగర్ నుంచి ఆకుల విజయ, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మీ, అంబర్‌పేట్ నుంచి మహిళ మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీలో చేరిన బోథ్ సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మునుగోడు నేత చలమల్ల కృష్ణారెడ్డిలకు సైతం మూడో జాబితాలో చోటు దక్కలేదు. అయితే వారి కోరిన సీట్లలో తదుపరి టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తున్నది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 88స్థానాలు పోగా మిగిలిన 31స్థానాల ప్రకటన సందర్భంగానైనా తమకు టికెట్ దక్కకపోదన్న ఆశతో ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఎస్సీ రిజర్వ్‌డ్‌లలో 13పేర్లు ప్రకటించగా, మూడు ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ స్థానాల్లో 9 పేర్లు ప్రకటించగా ఆరు స్తానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
జనసేనకు ఇచ్చే సీట్ల ను అనుసరించి మిగతా స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. అయితే జనసేనకు గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి సీట్లు ఇవ్వరాదని ఆ పార్టీ నాయకులు అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నారు. జంటనగరాల్లో బీజేపీ బలంగా ఉందని అలాంటప్పుడు వారికి సీట్లు ఇచ్చి పార్టీ నష్టపోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శేర్‌లింగంపల్లి, తాండూరు సీట్లను జనసేనకు ఇవ్వవద్దని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి గట్టిగానే హెచ్చరించారు.