విధాత : పూటకో పార్టీ మారే వాళ్లను నమ్మి ఓట్లు వేయద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఎవరి వైఖరి ఏంటో గమనించి ఓటేయాలి తప్ప.. ఎవరు చెప్పారనో ఓటు వేయవద్దని అన్నారు. అనేక రకాలుగా పార్టీలు మారే ఉన్నారని చెప్పారు. పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి, మాటలు మార్చేవారు మన మధ్యనే ఉన్నారని అన్నారు. అలాంటివారికి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో బీఆరెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఉపేందర్‌రెడ్డి అనంతరం బీఆరెస్‌లో చేరారు. ఆయనకు గులాబీ పార్టీ మళ్లీ అవకాశం ఇచ్చింది. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వాళ్లకు, పిచ్చి రాజకీయాలతో వచ్చే వాళ్లకు, మాటలు మార్చేవారికి, పూటపూటకు పార్టీలు మార్చే వారికి అవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తరు కానీ ప్రజలు గెలువరని సీఎం చెప్పారు.
ఖమ్మం జిల్లాలో గొప్ప అభివృద్ధి
బీఆరెస్ పదేళ్ల పాలనలో ఖమ్మం జిల్లా గొప్ప అభివృద్ధిని సాధించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే పాలేరు నియోజకవర్గం మొత్తానికీ దళిత బంధు ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. హుజరాబాద్ తరహాలో పాలేరు నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఓట్లకు నోట్లు పట్టుకొని వచ్చేవాళ్ళు ఏమీ చేయరని, ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీ వాకిలి దాటిస్తే దళిత బంధు తెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. బీఆరెస్ అభ్యర్థులను అసెంబ్లీ వాకిలి తొక్కనివ్వబోమంటూ డబ్బు అహంకారంతో కొందరు ఇక్కడ మాట్లాడుతున్నారని తుమ్మల, పొంగులేటిలని ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు.
తుమ్మల నాగేశ్వర్‌రావుకు నేను అన్యాయం చేశానని ప్రచారం చేస్తున్నాడని, కానీ.. పువ్వాడ అజయ్ చేతిలో ఖమ్మంలో ఓడిపోతే.. తానే ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇచ్చానని గుర్తు చేశారు. ఇంట్లో కూర్చున్న తుమ్మలకు మంత్రి పదవి ఇస్తే ఇవాళ అన్యాయం చేశానని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓడిపోయిన నిన్ను మంత్రిని చేస్తే ఖమ్మంకు చేసింది గుండు సున్న అని ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాను తుమ్మలకు అప్పగిస్తే బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాకుండా చేశాడన్నారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళిత బంధు.. బంద్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జైభీం అంటారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, 24 గంటల కరెంటు వద్దు అనే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని డబ్బు, మద్యంతో వచ్చే వారికి కాకుండా పార్టీలు విధానాలను చూసి ఓటు వేయాలని కోరారు. జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. తెలంగాణ తెచ్చేందుకు తాను చేసిన కృషిని వివరించి చెప్పారు.