– పాలమూరులో బీఆర్ఎస్ వారికే పథకాలు
– కాంగ్రెస్ వస్తే అన్నింటిపై విచారణ
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి
– నేడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనర్హులకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రద్దుచేసి, అర్హులకు ఇస్తామని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఓటమికి భయపడి డబుల్ బెడ్రూంలు ఇస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు ఎంతమందికి ఇచ్చారో మా దగ్గర జాబితా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిపై విచారణ జరిపించి ఆనర్హులకు ఇస్తే వాటిని రద్దు చేసి అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, పార్టీ మారిన వారందరినీ గడియారం చౌరస్తా వద్ద కట్టేసి కొడతానని అనడం సరికాదన్నారు.
మంత్రి దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ ను అసహ్యించుకొని నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలోనైనా ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సిన మంత్రి ఇష్టానుసారంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. పెద్ద చెరువు పనుల్లో ఎంత అవినీతి జరిగిందో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామికంగా, స్వేచ్ఛగా బతకాలంటే ఈ అరాచక పాలన పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆలోచించి ఇలాంటి అరాచక పాలనకు స్వస్తి పలకాలని కోరారు. ఆదివారం పాలమూరులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, నాయకులు ఎన్ పీ వెంకటేశ్, సురేందర్ రెడ్డి, సీజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.