ఎన్నికల వేళ ఎన్‌కౌంటర్లు.. నెలరోజుల్లోపు 21 మంది మృతి

చత్తీస్‌గడ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత నెల రోజులుగా వరుసగా సాగుతున్న కాల్పుల సంఘటనతో పచ్చని అడివిలో నెత్తురు చిందుతోంది

  • Publish Date - April 8, 2024 / 05:50 AM IST

చత్తీస్‌గడ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత నెల రోజులుగా వరుసగా సాగుతున్న కాల్పుల సంఘటనతో పచ్చని అడివిలో నెత్తురు చిందుతోంది

నెత్తురు చిందుతోన్న పచ్చని అడవి

మృతుల్లో తెలంగాణ వాసులు

గోదావరి సరిహద్దుల్లో అలజడి

కాంగ్రెస్ నేతలకు అగ్నిపరీక్ష

ఎన్నికల ప్రచారంపై ప్రభావం

కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత

విధాత ప్రత్యేక ప్రతినిధి: చత్తీస్‌గడ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత నెల రోజులుగా వరుసగా సాగుతున్న కాల్పుల సంఘటనతో పచ్చని అడివిలో నెత్తురు చిందుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతంలో సాగుతోన్న ఎన్ కౌంటర్లు తీవ్ర ఆందోళన రేకేత్తిస్తూ స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అడవిలో యుద్ధవాతావరణం నెలకొని తీవ్ర అలజడి రేపుతోంది. పచ్చని పల్లెలు, ఆదివాసీ గూడేలు భయంతో వణికిపోతున్నాయి. నెలరోజుల లోపు వ్యవధిలో జరిగిన ఎన్ కౌంటర్లలో 21 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సైతం మృతి చెందినట్లు చెబుతున్నారు.

ఎన్నికల ప్రకటన నుంచి… పార్లమెంట్ ఎన్నికల ప్రకటన నుంచి పరిస్థితి భయానకంగా మారింది. ఎండాకాలం కూంబింగుకు అనుకూలంగా ఉన్నందున ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టులు లక్ష్యంగా ఏరివేత చేపట్టారు. ఎండా కాలం వల్ల అడవి పలుచబడి, మంచి నీటి సమస్యను నక్సలైట్లు ఎదుర్కొంటున్నారు. ఇన్ఫార్మర్ వ్యవస్థను వినియోగించుకుని పోలీసు బలగాలు విరుచుకపడుతున్నందున నక్సలైట్లు తీవ్రంగా దెబ్బతింటున్నారు.

తెలంగాణలో పెరిగిన కలవరం
ఈ ఎన్ కౌంటర్లలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మృతిచెందడం కలవరం రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ మృతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన వారున్నారు. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నారనుకునే కుటుంబాలకు తమ బిడ్డలే మృతిచెందారనే వార్త తీవ్ర కలవరం సృష్టిస్తోంది.చత్తీస్ గడ్, ములుగు జిల్లా సరిహద్దు కర్రెగుట్ట సమీపంలోని పూజారి కాంకేర్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాంతానికి చెందిన సంతోష్ అలియాస్ సాగర్ మరణించారు.

సంతోష్ తో పాటు ఎసిఎం మణిరాం, మరో మావోయిస్టు మృతి చెందారు. రెండున్నర దశాబ్దాల క్రితం మావోయిస్టుల్లో చేరిన సంతోష్ అలియాస్ సాగర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎదిగారు. ఈ సంఘటనతో కాటారం పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్లో డివిజనల్ కమిటీ సభ్యుడు వర్గిస్, మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, వెంకటేష్ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో సంఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ ఎన్ కౌంటర్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు హతమైనట్లు ప్రకటించారు

ఈ సంఘటన తీవ్రసంచలనం సృష్టించింది. ఈ దాడిలో వెయ్యి మంది కమెండోలు పాల్గొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. గంటలకొద్దీ సమయం జరిగిన కాల్పుల మోతతో అటవీప్రాంతం దద్దరిల్లింది. అటవీప్రాంతంలోని ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాల నాయకులను నక్సలైట్లకు సహకరిస్తున్నారని అక్రమ అరెస్టుచేసి జైలుకు పంపిస్తున్నారని హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 

న్యూడెమోక్రసీ నాయకుల అరెస్టులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారం అటవీప్రాంతంలో న్యూడెమోక్రసీ పార్టీ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు, ముఖ్యనేతలను అరెస్టు చేసి కేసులు బనాయించి జైలుకు పంపిచారు. ఆ ప్రాంతంలో పోలీసుల నిత్యదాడులతో ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు.

వణుకుతున్న సరిహద్దు పల్లెలు

చత్తీస్ గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతం, ఆదివాసీ పల్లెలు, గూడాలు తుపాకుల మోత, పోలీసులు, ప్రత్యేక బలగాలు, సైన్యం కూంబింగులతో వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందోననే ఆందోళనతో భయంగుప్పిట జీవిస్తున్నారు. నెలరోజుల లోపు ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కాల్పులు 21 మంది నక్సలైట్లు మృతి చెందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. పగలు ప్రత్యేక పోలీసు బలగాలు, రాత్రి నక్సలైట్ల రాకతో స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు

రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సంఘటనలు వేలెత్తిచూపుతున్నాయి. 13 మంది మావోయిస్టులు మృతి చెందిన ఎన్ కౌంటర్లో చత్తీస్గడ్. తెలంగాణ గ్రేహౌండ్స్ సంయుక్త భాగస్వామ్యయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు తాజా ఆచరణ భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీయే ఈ ఎన్ కౌంటర్లకు బాధ్యతవహించాలంటూ మావోయిస్టు పార్టీ హెచ్చరిక జారీ చేసింది. ప్రతీకారంగా రక్తపు బాకీ తీర్చుకుంటామని ప్రకటించడం ఆందోళన రేకెత్తిస్తోంది.

ప్రచారానికి ఆటంకాలు

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఈ ఎన్ కౌంటర్లు ఆటంకం కలిగిస్తాయి. మహదేవ్ పూర్, మంథని, కాటారం, భూపాలపల్లి, ములుగు, భద్రచారం, ఇల్లందు తదితర అటవీప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంత మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి, తుమ్మల తదితరులను ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అంటూ హెచ్చరించింది.

ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్ దే బాధ్యత

ఎన్ కౌంటర్లకు కాంగ్రేస్ పార్టీ బాధ్యత వహించాలని,ములుగు ఎస్పీ కనుసన్నల్లో పూజారి కాంకేర్ ఎన్ కౌంటర్ జరిగిందని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామా రాజు డివిజన్ కమిటీ నేత ఆజాద్ పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టుల పై తెలంగాణ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర మూకుమ్మడి దాడులకు తెగబడుతున్నారు.

కార్పొరేట్ కంపెనీల తొత్తులుగా పనిచేస్తున్నారు. ఈ రాజ్యహింసలో పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రేస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలదీ ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వనరులను పెద్ద పెద్ద కంపెనీలకు, సామ్రాజ్య వాద తొత్తులకు తాకట్టు పెట్టేందుకు మమ్మల్ని అణగదొక్కుతున్నారు. దండకారణ్యమంతా పోలీసు క్యాంపులతో నింపేస్తున్నారు

డ్రోన్లు, హెలీకాప్టర్లతో దాడులు చేస్తున్నారు. విష ప్రయోగం చేసి పట్టుకొని కిరాతకంగా హింసించి ఎన్ కౌంటర్ కథలల్లుతున్నారు. కాంకేర్ ఎన్ కౌంటర్ కు ములుగు ఎస్సీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నియంతగా వ్యవహరించాడు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని, ప్రజా హక్కులను పరిరక్షిస్తానని అధికారంలోకి వచ్చి పోలీసు బలగాలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్ కౌంటర్లకు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ఆజాద్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

 

 

Latest News