విధాత, హైదరాబాద్ : విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు..మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు అంటూ బీఆరెస్ పాలనలో గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా ఆదివాసీ దినోత్సవంపై స్పందించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆరెస్ ప్రభుత్వానిదేనని, ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది కేసీఆర్ అని ట్వీట్‌లో పేర్కోన్నారు. మావ నాటే మావ రాజ్..మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. జల్ జంగల్ జమీన్ అన్న కొమురం భీమ్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని పేర్కోన్నారు.